సిడ్నీ, మే 22: ఆస్ట్రేలియా నూతన, 31వ ప్రధానిగా లేబర్ పార్టీ నేత ఆంటోనీ ఆల్బనీస్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నది. ఇటీవల పార్లమెంట్లోని 151 స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి శనివారం కౌంటింగ్ జరిగింది.
స్కాట్ మారిసన్ నేతృత్వంలోని లిబరల్-నేషనల్ కూటమికి కేవలం 51 స్థానాలు మాత్రమే దక్కగా, ఆంటోనీ పార్టీ 72 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అయితే అధికారం చేపట్టేందుకు సింగిల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ(76) రాకపోయినా.. స్వతంత్రులుగా ఎన్నికైన వారి మద్దతుతో ఆంటోనీ అల్బనీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆల్బనీస్ 1996 నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు.