అగ్రరాజ్యం అమెరికాలో ఆల్ఫా-గాల్ సిండ్రోమ్ (Alpha-Gal Syndrome) కలకలం రేపుతున్నది. దేశవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మంది వరకు ఈ ఆల్ఫా-గాల్ సిండ్రోమ్ (AGS) బారినపడే ప్రమాదం పొంచి ఉన్నదని అమెరికాకు చెందిన ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDS)’ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు రెండు కొత్త నివేదికలను విడుదల చేసింది. దాంతో ఆమెరికా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ సిండ్రోమ్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆల్ఫా-గాల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? అది ఎందుకంత ప్రమాదం..? దానివల్ల కలిగే అనర్థాలు ఏమిటి..? దాన్ని అరికట్టడం ఎలా..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
ఈ AGS (ఆల్ఫా-గాల్ సిండ్రోమ్) అనేది చాలా తీవ్రమైన స్కిన్ అలర్జీ. కొంతమందిలో ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. సాధారణంగా పేలు, గోమార్లు, పిడుదులు లాంటి సూక్ష్మ కీటకాలు కుట్టిన జీవుల మాంసాన్ని, వాటి నుంచి వచ్చే డెయిరీ ఉత్పత్తులను తినడం ద్వారా, నేరు ఆయా కీటకాల కాటుకు గురికావడం ద్వారా మానవుల్లో ఈ అలర్జీ వస్తుంది. ఈ అలర్జీని లైట్ తీసుకుంటే కొందరిలో వ్యాధి ముదిరి ప్రాణాలు మీదకు వస్తుంది. కాబట్టి ప్రజలు ఎదుర్కొనే ప్రధాన అనారోగ్య సమస్యల్లో ఈ AGS ను కూడా ఒకటిగా చెప్పుకోవచ్చని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఆన్ కార్పెంటర్ తెలిపారు.
వైద్య నిపుణులు ఈ AGS గురించి వివరంగా తెలుసుకోవడం చాలా అవసరమని ఆయన చెప్పారు. టిక్ బైట్ కారణంగా వచ్చే సిండ్రోమ్ గురించి వైద్యులు అవగాహన కలిగి ఉండటంవల్ల తమ దగ్గరికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించగులుగుతారని అన్నారు. వ్యాధిని గుర్తించడమేగాక దాని తీవ్రతను అంచనా వేసి, రోగులకు అవగాహన కల్పించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడుతారని తెలిపారు. రోగుల్లో అలర్జీ తీవ్రత మరింత ముదురకుండా తగిన జాగ్రత్తలు సూచించగలుగుతారని పేర్కొన్నారు.
ఆల్ఫా-గాల్ సిండ్రోమ్ (AGS) అంటే ఏమిటి..?
అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదిక ప్రకారం ఆల్ఫా-గాల్ సిండ్రోమ్ (AGS) అనేది తీవ్రమైన, ప్రాణాంతకమైన అలర్జీ. ఈ AGS నే ఆల్ఫా-గాల్ అలర్జీ అని, రెడ్ మీట్ అలర్జీ అని, టిక్-బైట్ మీట్ అలర్జీ అని కూడా అంటారు. గోమార్లు లాంటి సూక్ష్మ కీటకాలు కుట్టిన ఎద్దు, మేక, పంది, గొర్రె తదితర క్షీరద జీవుల మాంసాన్ని, వాటి డెయిరీ ఉత్పత్తులను తిన్నప్పుడు గానీ, ఆయా కీటకాల కాటుకు నేరుగా గురైనప్పుడు గానీ వాటిలోని ఆల్ఫా-గాల్స్ మానవుడిలోకి ప్రవేశిస్తాయి. దాంతో శరీరం ఇన్ఫెక్షన్కు గురవుతుంది. ఆ సమయంలో ఇన్ఫెక్షన్కు కారణమైన ఆల్ఫా-గాల్స్ను ఎదిరించేందుకు శరీరం ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల మానవుని రోగ నిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు గురై అలర్జీలకు దారి తీస్తుంది. అప్పటికే ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తి ఆల్ఫా-గాల్ మిళితమైన ఏదైనా పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటే అతని ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.
AGS లక్షణాలు..
ఆల్ఫా-గాల్స్ కలిగిన మాంసాన్ని లేదా డెయిరీ ఉత్పత్తులను ఆహారంగా తీసుకున్న తర్వాత రెండు నుంచి ఆరు గంటలకు ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ సిండ్రోమ్ ప్రభావం వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. కొందరు తేలికపాటి అలర్జీకి లోనయితే, మరికొందరు ప్రాణాంతక అలర్జీల బారిన పడుతారు. సాధారణంగా (AGS) బారినపడిన వారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయని CDS నివేదిక వెల్లడించింది.
అవి:
1. చర్మంపై దురద దద్దుర్లు ఏర్పడటం
2. గుండెల్లో మంటగా అనిపించడం
3. తిన్న పదార్థాలు జీర్ణం కాకపోవడం
4. నీళ్ల విరేచనాలు కావడం, దగ్గు రావడం
5. శ్వాస సరిగా ఆడకపోవడం
6. రక్తపోటు తగ్గిపోవడం
7. పెదవులు, గొంతు, నాలుక, కను రెప్పలు వాయడం
8. మైకం కమ్మినట్లుగా ఉండటం
9. తీవ్రమైన కడుపు నొప్పి
AGS బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. ఆల్ఫా – గాల్ సిండ్రోమ్ బారిన పడకుండా ఉండాలంటే ముందుగా సంబంధిత సూక్ష్మ కీటకాల కాటుకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. సూక్ష్మ కీటకాల బారిన పడకుండా ఉండటం వల్ల ఈ AGS అభివృద్ధి చెందే ప్రమాదం తగ్గుతుంది.
2. ఆరు బయటికి వెళ్లినప్పుడు సూక్ష్మ కీటకాలు కలిగిన పచ్చగడ్డి, చెట్లు, పొదలకు దూరంగా ఉండాలి. గడ్డిపైన కాకుండా బాట మధ్యలో నడవాలి.
3. నిత్యం ధరించే దుస్తులు, వినియోగించే పరికరాలపై సూక్ష్మ కీటకాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
4. బయటికి వెళ్లి వచ్చినప్పుడు మన దుస్తులపైగానీ, వస్తువులపైగానీ, పెంపుడు జంతువులపైగానీ కీటకాలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే శుభ్రం చేయాలి.
ఇప్పటికే AGS బారిన పడి ఉంటే ఏం చేయాలి..?
ఇప్పటికే ఆల్ఫా – గాల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వాళ్లు చాలా జాగ్రత్తలు పాటించాలి. వైద్యులు సూచించిన మెడికేషన్ తీసుకోవాలి. వైద్యుల సలహాలు, సూచనలు తూచా తప్పకుండా పాటించాలి. సమస్య సమసిపోయే వరకు తరచూ వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలర్జీ తీవ్రత మరింత తీవ్రంగా ఉంటే కొన్ని రోజులపాటు నిపుణుడైన వైద్యుడి పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలి.