టొరంటో, జనవరి 11: కెనడాలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఒక ప్రయాణికుడి చర్య అందరినీ షాక్‌నకు గురి చేసింది. టొరంటో నుంచి దుబాయ్ వెళ్లనున్న విమానంలో హఠాత్తుగా తలుపును తెరచిన ఒక ప్రయాణికుడు అక్కడి నుంచి కిందకు దూకాడు. ఈ ఘటన టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ కెనడాకు చెందిన ఏసీ056 విమానంలో సోమవారం చోటుచేసుకుంది.
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విమానం లోపలకి వచ్చిన ఆ ప్రయాణికుడు తన సీటువైపు వెళ్లకుండా అవతలి వైపున ఉన్న కేబిన్ డోర్ తెరచి కిందకు దూకేశాడు. సుమారు 20 అడుగుల పైనుంచి దూకడంతో గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ ప్రయాణికుడిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో విమానం ఆరుగంటలు ఆలస్యంగా బయలుదేరింది.