Fuel Free Space Travel | న్యూయార్క్, మార్చి 5 : నాసా శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనల్లో గేమ్‌ఛేంజర్ లాంటి ఆవిష్కరణ చేశారు. ఇంధనం లేకుండానే అంతరిక్షంలో ప్రయాణించేందుకు వీలుగా నూతన ‘శక్తి’ని కనుగొన్నట్టు, విద్యుత్తు క్షేత్రాలను వినియోగించడం ద్వారా ఇంధనం లేకపోయినా రాకెట్లకు కావాల్సిన థ్రస్ట్‌ను ఇది అందిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు నాసాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ చార్లెస్ బుహ్లెర్ తెలిపారు. నాసా నూతన ఆవిష్కరణ భౌతికశాస్త్ర నియమాలకు సవాలు విసురుతున్నది.
‘ప్రతిఒక్క చర్యకు అందుకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది’ అనే న్యూటన్ మూడో సూత్రాన్ని ఇది ఉల్లంఘిస్తున్నది. నాసా చెప్పేది నిజమైతే భౌతికశాస్త్రం పుస్తకాల్లో సూత్రాలను తిరగరాయాల్సి ఉంటుంది. అంతరిక్ష ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులు జరుగుతాయి. ఇంధనం లేకుండానే అంతరిక్ష మిషన్లను చేపట్టవచ్చు. అయితే, ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉన్నది. ప్రయోగ దశలో ఉన్న ఇది వాస్తవరూపం దాలుస్తుందా? లేదా గతంలో చరిత్ర గతిలో కలిసిపోయిన స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ‘ఎమ్ డ్రైవ్’లాగా ప్రయోగశాలలో కలగానే మిగిలిపోతుందా? అన్నది చూడాలి. అయితే, తాము ఆవిష్కరించిన ‘శక్తి’ని అర్థం చేసుకునేందుకు ‘ఒక తెలివైన భౌతికశాస్త్ర నిపుణుడు’ అవసరమని చార్లెస్ ధీమాగా చెబుతున్నారు.