లాస్ ఏంజిల్స్: ఈ ఏడాది తొలి క్వార్టర్లో అధిక సంఖ్యలో సబ్స్క్రైబర్లు తగ్గినట్లు ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో నెట్‌ఫ్లిక్స్ షేర్లు 35 శాతం పడిపోయాయి. దాని వల్ల ఆ సంస్థ సుమారు 50 బిలియన్ల డాలర్ల విలువైన మార్కెట్ షేర్‌ను కోల్పోయినట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ ప్రత్యర్థుల నుంచి నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో ఆ కంపెనీ సబ్స్క్రైబర్లు గణనీయంగా తగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో పాస్వర్డ్ షేరింగ్‌ను కూడా నియంత్రించేందుకు నెట్‌ఫ్లిక్స్ చర్యలు తీసుకున్నది. అమెరికా ఇన్వెస్టర్ విలియమ్ ఆక్మాన్.. నెట్‌ఫ్లిక్స్‌లో 1.1 బిలియన్ల డాలర్ల పెట్టుబడిని ఉపసంహరిస్తున్నట్లు చెప్పారు. నెట్‌ఫ్లిక్స్ తన వ్యాపార మోడల్‌ను మార్చడంతో పెట్టుబడి ఆందోళనకరంగా మారినట్లు ఆక్మాన్ తెలిపారు. గడిచిన మూడు నెలల్లో రెండు లక్షల మంది సబ్స్క్రైబర్లు తగ్గినట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొన్న విషయం తెలిసిందే.