హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బొటానికల్ గార్డెన్లో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచడానికి కొత్త సౌకర్యాలను కల్పిస్తోంది. సోమవారం కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో ‘అర్బన్ మినీ గోల్ఫ్ హైదరాబాద్ (మినీగోల్ఫ్)’ ను తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్‌చైర్మన్, ఎండీ డాక్టర్ జి. చంద్రశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొటానికల్ గార్డెన్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించిన సందర్శకులకు మరింత సంతోషాన్ని, ఆహ్లాదాన్ని అందించడమే మినీ గోల్ఫ్ లక్ష్యమన్నారు.
బొటానికల్ గార్డెన్‌ను మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దేందుకు 2వేల జాతుల ఔషధ మొక్కలు నాటాలని లక్ష్యంగా టీఎస్ఎఫ్డీసీ పెట్టుకుందని చెప్పారు. కార్యక్రమంలో ఎకో టూరిజం డైరెక్టర్ ఎంజే అక్బర్, ఏకో టూరిజం ఓఎస్డీ టి.పి. తిమ్మారెడ్డి, జీఎం ఎ.రవీందర్‌రెడ్డి, ఎకో టూరిజం సీనియర్ డీఎం డాక్టర్ జి.స్కైలాబ్, ప్రాజెక్టు మేనేజర్ కె.సుమన్, ప్లాంటేషన్ మేనేజర్ -1 ఎన్.రాజేంద్రకుమార్, ప్లాంటేషన్ మేనేజర్-2 వి.లక్ష్మారెడ్డి, బొటానికల్ గార్డెన్ ప్రతినిధులు పాల్గొన్నారు.