DGP CV Anand | రాష్ట్ర భద్రతకు బలమైన కవచంగా స్పెషల్ బెటాలియన్ : డీజీపీ సీవీ ఆనంద్
DGP CV Anand | జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొని వివిధ పరిపాలనా, సాంకేతిక, సంక్షేమ అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
DGP CV Anand | హైదరాబాద్, జూన్ 30 : తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణ, విపత్తు నిర్వహణ, వీఐపీ బందోబస్తు, ప్రత్యేక ఆపరేషన్లలో కీలక భూమిక పోషిస్తున్న తెలంగాణ స్పెషల్ బెటాలియన్లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత ఆధునికంగా, సాంకేతికంగా బలోపేతం చేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అధికారులకు సూచించారు. జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని వివిధ పరిపాలనా, సాంకేతిక, సంక్షేమ అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి ముందు డీజీపీ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలు, పరిపాలనా సెక్షన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఆయుధాల నిర్వహణ, సాంకేతిక విభాగాలు, నిర్మాణ పనులు, కార్యాలయ నిర్వహణ, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం అధికారులు సమర్పించిన ప్రజెంటేషన్‌ను పరిశీలించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. బెటాలియన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడం, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, వాహనాల సంఖ్యను పెంచడం, సిబ్బందికి మెరుగైన నివాస క్వార్టర్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక బలగాల సేవలను ప్రత్యక్షంగా చూశా..
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (APSP) బెటాలియన్లు నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో సివిల్ పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచి ఎన్నో కీలక ఆపరేషన్లలో విశేష సేవలు అందించాయని గుర్తు చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేక బలగాలను అనుసంధానం చేయడం ద్వారా పోలీసు వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసిందన్నారు.
తాను నిజామాబాద్, వరంగల్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాల ఎస్పీగా పని చేసిన సమయంలో ప్రత్యేక బలగాల సేవలను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్లపై తరచూ నక్సల్స్ దాడులు జరిగేవని, అలాంటి పరిస్థితుల్లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు అత్యంత ధైర్యసాహసాలతో విధులు నిర్వహించి నక్సల్స్ నిర్మూలనలో కీలక పాత్ర పోషించాయని ప్రశంసించారు.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం 13 స్పెషల్ బెటాలియన్లను ఏర్పాటు చేసి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాటిని అభివృద్ధి చేసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ బెటాలియన్లు ఎన్నికల సమయంలో భారీ బందోబస్తు, శాంతిభద్రతల నిర్వహణ, ముఖ్యమైన ఉత్సవాలు, మతపరమైన వేడుకలు, ప్రజాసమావేశాలు, వీఐపీ భద్రత, విపత్తు నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల రక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాయని కొనియాడారు.
ఇటీవల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల సమయంలో తెలంగాణ స్పెషల్ బెటాలియన్ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యల్లో పాల్గొనడం, ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో అంకితభావంతో పనిచేశారని అభినందించారు.
మానసిక ఒత్తిడి ఏర్పడే అవకాశం..
బెటాలియన్ల కమాండెంట్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, పరిపాలనలో క్రమశిక్షణతోపాటు మానవతా దృక్పథం కూడా ఉండాలని సూచించారు. సిబ్బంది కుటుంబ పరిస్థితులు, ఆరోగ్యం, పిల్లల విద్య, వ్యక్తిగత సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలవాలని చెప్పారు.
దూర ప్రాంతాల్లో నెలల తరబడి విధులు నిర్వహించే సిబ్బందికి కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో అధికారులు వారికి అవసరమైన మానసిక బలం అందించాలని సూచించారు.
విధుల్లో పారదర్శకత..
డ్యూటీల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎలాంటి వివక్షకు తావివ్వకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు, ప్రత్యేక బందోబస్తు, వీఐపీ విధులు, ఇతర ప్రత్యేక డ్యూటీలను కూడా నిష్పాక్షికంగా కేటాయించాలని ఆదేశించారు. గతంలో 18 నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉండేవి. ఇప్పుడూ ఆ సమస్య తీరిందన్నారు. ప్రతి బెటాలియన్ పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, సమగ్ర రివ్యూ నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీ, ఆమనగల్ ప్రాంతాల్లో కొత్త స్పెషల్ బెటాలియన్ల ఏర్పాటు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
‘మిత్ర’ కౌన్సెలింగ్ కేంద్రాలు..
పోలీసు సిబ్బందిలో మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ.. మిత్ర కౌన్సెలింగ్ కేంద్రాలను మరింత సమర్థంగా వినియోగించాలని సూచించారు. విధుల ఒత్తిడి, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులతో బాధపడుతున్న సిబ్బందిని గుర్తించి వారికి నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని ఆదేశించారు. డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, ఇతర వ్యసనాల బారిన పోలీసు సిబ్బంది ఎవరూ పడకుండా అధికారులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాంటి అలవాట్లకు గురైన వారిని శిక్షించడం కంటే ముందుగా గుర్తించి, కౌన్సెలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు.
పోలీస్ సిబ్బందిలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను అధికారులు, సహచరులు ముందుగానే గుర్తించి తక్షణమే స్పందించాలని సూచించారు. ప్రతి కమాండెంట్ తన పరిధిలోని సిబ్బందితో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పారు. శిక్షణకు ఎల్లప్పుడూ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆధునిక పోలీసింగ్‌కు అనుగుణంగా ప్రత్యేక శిక్షణా కేంద్రాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ వినియోగం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం, మానసిక దృఢత్వంపై నిరంతర శిక్షణ అందించాలని సూచించారు. తెలంగాణ స్పెషల్ బెటాలియన్లు రాష్ట్ర పోలీసు వ్యవస్థకు వెన్నెముక వంటివని పేర్కొన్న డీజీపీ, భవిష్యత్తు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా ఆధునికీకరణ, క్రమశిక్షణ, సాంకేతికత, సిబ్బంది సంక్షేమం అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Also :
Canal Missing | ప్రభుత్వ రికార్డుల్లోని కాల్వ మాయం.. ఫామ్‌ల్యాండ్ వెంచర్ కోసం ఆగని ఆక్రమణలు
Guo Wengui: చైనా బిలియనీర్‌కు 30 ఏళ్ల జైలుశిక్ష విధించిన అమెరికా కోర్టు
AP News | రైల్వేస్టేషన్లో పాములు.. ప్రయాణికులు బెంబేలు..!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

