కానరాని కనీస అగ్నిమాపక పరికరాలు
నిబంధనలు పాటించని స్క్రాప్ దుకాణాలపై చర్యలు
అమీర్‌పేట్, ఏప్రిల్ 13 : ఎండలు మండుతున్నాయి. అగ్నిప్రమాదాలకు అవకాశాలెక్కువ.. ఇటువంటి పరిస్థితుల్లో మంటలు చెలరేగితే వాటిని సకాలంలో ఆర్పివేయాలి.. అందుకు అవసరమైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి. అయితే ఫతేనగర్ ఫ్లైఓవర్ కింద లెక్కకు మించిన స్క్రాప్ దుకాణాలు, గోదాములున్నా.. వాటిలో ఏ ఒక్కటి కూడా అగ్నిమాపక పరికరాలు కలిగి ఉన్నట్టు కనిపించడంలేదు. గోదాములు చిన్నగానే ఉంటున్నా.. వాటిలో సామర్ధ్యానికి మించి స్క్రాప్‌ను నింపుతుండటం ప్రమాదకర పరిస్థితులను సూచిస్తోంది. ఫ్లైఓవర్ కిందనే దాదాపు పదుల సంఖ్యలో స్క్రాప్ దుకాణాలున్నా కనీసం అగ్ని మాపక నిబంధనలు పాటించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అగ్నిమాపక అధికారులు ఎప్పుడైనా వీటిని నియంత్రించే చర్యలు చేపట్టినా రాజకీయ జోక్యం కారణంగా బెడిసి కొడుతున్నాయి. అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో అయినా.. బన్సీలాల్‌పేట్ తరహా ప్రమాదర ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా అగ్నిమాపక అధికారులు గట్టి చర్యలు తీసుకుంటే మంచిదని పలువురు పేర్కొంటున్నారు.
నియంత్రణ చర్యలు చేపడుతాం..
ఫతేనగర్ఖ ఫ్లై ఓవర్ కింద నిబంధనలకు విరుద్ధంగా నెలకొన్న స్క్రాప్ దుకాణాలు, గోదాములకు సంబంధించి ఇప్పటికే ఆయా దుకాణాల నిర్వాహకులను అప్రమత్తం చేశాం. ప్రమాదాలు జరిగిన వెంటనే మంటలను నియంత్రణలోకి తెచ్చేలా అవసరమైన అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా సూచించాం. ఈ విషయమై త్వరలోనే క్షేత్ర స్థాయి పర్యటనలు జరిపి నిబంధనలను విరుద్ధంగా ఉన్న స్క్రాప్ దుకాణాలను గుర్తించి చర్యలు తీసుకుంటాం. – ఎస్.ప్రదీప్‌కుమార్,
అగ్నిమాపక అధికారి సనత్‌నగర్