సిటీబ్యూరో: ట్రై కార్పొరేషన్ పరిధిలో ఎల్ఆర్ఎస్ పథకం లబ్ధిదారుల సహనానికి పరీక్ష పెడుతున్నది. అధికారులు చిన్న, చిన్న కారణాలతోనూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, నాలాలు సమీపంలో ఉన్నట్టు తెలిస్తే చాలు.. దరఖాస్తులను ఆమడదూరం పెడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,06,891, ఓఆర్ఆర్ పరిధి (విలీనమైన పురపాలిక)లో దాదాపు 40వేలకు పైగా దరఖాస్తుల్లో దాదాపు లక్ష వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ దరఖాస్తులను 60 సర్కిళ్లకుగానూ క్లస్టర్ల వారీగా విభజన చేసి, ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టాలని తాజాగా నిర్ణయించారు. క్షేత్ర స్థాయి పరిశీలన సులభంగా చేపట్టేందుకు వీలుగా గ్రామం,వార్డు, సర్వే నంబర్, కాలనీల వారీగా క్లస్టర్లుగా విభజించే ప్రక్రియను చేపట్టారు. సదరు ప్లాటు ప్రభుత్వ భూమిలో ఉందా? ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా? వంటి అంశాలను పరిశీలించి… దరఖాస్తు క్రమబద్ధీకరించేందుకు అర్హత ఉందా? లేదా? అనే దానిపై క్షుణ్ణంగా పరిశీలించి క్లియర్ చేయాలని సంబంధిత సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.