సిటీబ్యూరో,జనవరి 12 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌కు మరో రాచమార్గం రాబోతున్నది. ఎస్ఆర్డీపీలో భాగంగా ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి గచ్చిబౌలి ఐటీ కారిడార్ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ రూ. 330 కోట్లతో 1.75 కిలోమీటర్ల పొడవున ఫ్లైఓవర్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీని నిర్మాణంలో భాగంగా బుధవారం కీలక ఘట్టం పూర్తయ్యింది. అత్యంత పొడవైన స్పాన్‌ను గచ్చిబౌలి వంతెన మీదుగా 64 మీటర్లతో విజయవంతంగా అమర్చినట్లు అధికారులు తెలిపారు. పట్టణ మౌలిక వసతుల్లో భాగంగా ఐటీ కారిడార్‌లో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ ఎంతో క్లిష్టమైనదని, అయినా విజయవంతంగా అధిగమించి గచ్చిబౌలి క్రాస్‌రోడ్‌లో మూడు భారీక్రేన్ల సహాయంతో స్పాన్లను బిగించినట్లు పేర్కొన్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ జంక్షన్లో పనులు చేపట్టడం కత్తిమీద సాములాంటిదని, అలాంటి చోట అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ స్పాన్లను ఫ్లైఓవర్ కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ ఐటీ కారిడార్ నుంచి ఔటర్‌రింగు రోడ్డుకు నేరుగా అనుసంధానం అవుతుందని, దీనిద్వారా గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం దొరకనుందని పేర్కొన్నారు. ఔటర్ నుంచి వచ్చే వాహనాలు కొత్తగా నిర్మించే ఈ వంతెన మీదుగా హైటెక్‌సిటీ వైపు సాఫీగా చేరుకునే సౌకర్యం ఉంటుంది. అటు వైపు నుంచి ఔటర్‌కు సులువుగా చేరుకోవచ్చు. ఇందుకోసం రెండు ర్యాంపులు (దిగువ/ఎగువ) ఏర్పాటు చేశారు.
జూన్ నాటికి మొదటిది పూర్తి
ఔటర్ నుంచి మాదాపూర్, కూకట్పల్లి, ఐకియా వైపు, ఔటర్‌కు నేరుగా వెళ్లేలా బై-డైరెక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతుంది. ఇప్పటికే పనులు శరవేగంగా కొనసాగుతుండగా, గచ్చిబౌలి ఫ్లైఓవర్ పైనుంచి ఔటర్‌ను కలుపుతూ పైవంతెనను నిర్మిస్తున్నట్లు ప్రాజెక్ట్ ఎస్ఈ వెంకటరమణ తెలిపారు. ఈ ఏడాది జూన్ చివరి నాటికి మొదటి ఓఆర్ఆర్ నుంచి మీనాక్షి వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ నుంచి నేరుగా ఐటీ కారిడార్ వైపు వెళ్లేలా, తిరిగి ఓఆర్ఆర్ చేరుకునేలా దీన్ని నిర్మిస్తున్నారు. పాత ముంబై హైవేపైకి చేరుకునేలా గచ్చిబౌలి పెట్రోల్‌బంకు వద్ద మరో రెండు ర్యాంపుల నిర్మాణం జరుగుతుంది.
ఓఆర్ఆర్ టూ కొండాపూర్..
రద్దీ వేళల్లో ఔటర్ నుంచి కొండాపూర్ వైపునకు వాహనదారులు సులభంగా వచ్చిపోయేలా ప్రత్యేక ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ పనులు ప్రారంభమవ్వగా,రోడ్డు ఎన్‌క్రోచ్‌మెంట్ పనులు సైతం వేగంగా సాగుతున్నాయి. 816 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల బై డైరెక్షన్ ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ రెండు ఫ్లైఓవర్లు అందుబాటులోకొస్తే గచ్చిబౌలి జంక్షన్లో రద్దీ పూర్తిగా తగ్గిపోనుంది.