MLA Talasani | నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద గల ఆయన విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. 1969 లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ అని పేర్కొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం సమయంలో తన ఇంటినే కార్యాలయంగా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి అండగా నిలిచారని చెప్పారు. కేవలం పద్మశాలీలకే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యం చేసేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు. పద్మశాలీలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని వివరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ తీసుకొచ్చిన కార్యక్రమలను నిలిపివేయడం దుర్మార్గం అని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.