బంజారాహిల్స్, డిసెంబర్ 4: ఇంటిముందు పార్కింగ్ చేసిన కారు మాయమైంది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన కె.రవితేజ తన ఇన్నోవా కారును సినిమా షూటింగ్స్‌లో నడిపిస్తున్నాడు.
బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న రవితేజ.. గత నెల 25న తెల్లవారుజామున తన కారును ఇంటి ముందు పార్క్ చేశాడు. తిరిగి ఉదయం చూడగా కారు కనిపించలేదు. అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.