సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): మూడు కమిషనరేట్ల పరిధిలో నేరాలు తగ్గించేందుకు పోలీసులు తాజాగా వాహనాల నంబర్ ప్లేట్లపై దృష్టిసారించారు. ఇందుకు స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఒకేరోజు వరుసగా జరిగిన ఏడు చైన్ స్నాచింగ్ నేరాల్లో పాల్గొన్న నిందితులు చోరీ చేసిన వాహనాలను ఉపయోగించారు. ఆ వాహనాలపై తిరిగి చైన్ స్నాచింగ్‌లు చేయడంతోపాటు తప్పించుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే వాహనాల నంబర్ ప్లేట్లపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నంబర్ ప్లేట్లను మార్చిన వాహనాలను, నంబర్ ప్లేట్ లేని వాహనాలను, నకిలీ నంబర్ ప్లేట్‌తో రోడ్డుపైకి వస్తున్న వాహనాలపై మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝలిపిస్తున్నారు. అంతేకాదు.. నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు లేని వాహనాల వివరాలను ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. డయల్ 100, స్థానిక పోలీసులకు కాల్చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
ట్యాంపరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు..
నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి తిరుగుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలు పాటించని కొంతమంది వాహనదారులు.. చలాన్ల నుంచి తప్పించుకునేందుకు తమ వాహనాల నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మరికొందరు దొంగిలించిన వాహనాలకు సైతం నంబర్ ప్లేట్లు మారుస్తున్నారు. అదేవిధంగా నంబర్ ప్లేట్లు మార్చిన వాహనాలపై తిరుగుతున్న నేరగాళ్లు చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నారు. నంబర్ ప్లేట్ల విషయంలో వాహనాల యజమానులు నిబంధనలు పాటించడంలేదంటే.. వాహనదారులు నేరం చేస్తున్నారన్న విషయం స్పష్టవుతుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి వారిపై పోలీసులు కొరఢా ఝలిపిస్తున్నారు.
నిబంధనల మేరకు నంబర్ ప్లేట్లు ఉండాలి
ప్రతి ఒక్కరూ తమ వాహనాల నంబర్ ప్లేట్‌ను నిబంధనల మేరకు అమర్చుకోవాలి. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. ట్రాఫిక్, శాంతి భద్రతల పోలీసులు కలిసి నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వాహనానికి నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే.. ఆ వాహనదారుడు చట్టాన్ని అతిక్రమిస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో వాహనంతో పాటు వాహనం నడిపే వారి బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులు నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్‌కు ప్రజలు సహకరించాలి. ఎవరైనా నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తే సదరు సమాచారాన్ని బాధ్యత గల పౌరులుగా డయల్ 100కు సమాచారం ఇవ్వండి. సదరు వ్యక్తుల సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించండి.