గోల్నాక/సుల్తాన్‌బజార్, అక్టోబర్ 19: యజమానిని నమ్మించి నగదుతో పరారైన కేసును అఫ్జల్‌గంజ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి పరారీలో ఉండగా.. నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.28.19 లక్షల నగదు, సెల్ ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి , ఏసీపీ దేవేందర్‌తో కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ వివరాలను వెల్లడించారు.
అఫ్జల్‌గంజ్ నివాసి అశోక్ బన్సాల్ వ్యాపారి. అతడి వద్ద చార్మినార్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సుల్తాన్ (31)పనిచేస్తున్నాడు. వీరిద్దరు కలిసి ఈ నెల 3వ తేదీన గౌలీగూడలోని ఓ దుకాణంలో బంగారం కొనేందుకు బైక్‌పై వెళ్లారు. అయితే, ముందుగా వేసుకున్న పక్కా ప్రణాళికతో తన నలుగురు స్నేహితులతో కలిసి యజయానిని ఏమార్చిన సుల్తాన్.. నగదు ఉన్న బ్యాగ్‌తో అక్కడి నుంచి ఉడాయించాడు. కొట్టేసిన నగదుతో నిందితులు ముంబై, జమ్మూ, పంజాబ్ తదితర ప్రాంతాల్లో తిరిగి జల్సాలు చేశారు. కాగా.. బాధితుడు అశోక్ బన్సాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రధాన నిందితుడైన సుల్తాన్‌కు సహకరించిన భవానీనగర్‌కు చెందిన మహ్మద్ సర్ఫరాజ్(24), రెయిన్‌బజార్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్(27), షేక్ ముబీన్(19), మీరాలంమండీకి చెందిన మహ్మద్ షోయబ్(19)లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద రూ.28.19 లక్షల నగదుతో పాటు ఓ బైక్, నాలుగు సెల్ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సుల్తాన్ పరారీలో ఉన్నాడు. కేసును ఛేదించిన అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డితో పాటు సిబ్బందిని ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు.