దేశంలో మెట్రోపాలిటన్ నగరాల కంటే గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. విశ్వనగరం దిశగా అడుగులు పడుతున్న వేళ వడివడిగా మరో వంతెన సిద్ధమయింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ముందుచూపుతో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధిలో భాగంగా 17 ఫ్లైఓవర్ ప్రారంభానికి ముస్తాబు అవుతోంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ చిక్కులు తప్పించే రవాణాయే లక్ష్యంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్ పైన శిల్పా లేఅవుట్లో నిర్మించిన వంతెనను ఈ నెల 20న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వంతెనకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇదే సమయంలో గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.
సిటీబ్యూరో, నవంబరు 7 (నమస్తే తెలంగాణ): దేశంలో మెట్రో నగరాల కంటే గ్రేటర్ హైదరాబాద్ వేగంగా అబివృద్ధి చెందుతున్నది. ఈ క్రమంలో ప్రపంచమే హైదరాబాద్ వైపు చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు సరళీకృత విధానాలు అమలు చేయడం, ఇందుకు తగ్గట్లుగా జీహెచ్ఎంసీ ప్రజల అవసరాలను ముందుగా అంచనా వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రధానంగా రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగు పరచడంపై దృష్టి సారించింది. వాహనదారులు గమ్యస్థానానికి సకాలంలో చేరడానికి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీపీ) ప్రోగ్రాం ద్వారా చేపట్టిన పలు పనులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగానే శిల్పా లే అవుట్ వద్ద నిర్మించిన 17వ ఫ్లై ఓవర్‌ను ఈ నెల 20న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. పనులు తుది దశకు చేరుకున్నాయి.
ఎస్ఆర్డీపీలో 17వ ఫ్లై ఓవర్..
ఓఆర్ఆర్ నుంచి గతంలో ఉన్న గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై నుంచి శిల్పా లే అవుట్ వరకు అకడ నుంచి ఓఆర్ఆర్ వరకు రెండు వైపులా కలుపుకుని మొత్తం 956 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పు గల ఫ్లై ఓవర్ చేపట్టారు. అప్ ర్యాంపు ఓఆర్ఆర్ నుంచి శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వరకు 456.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లై ఓవర్లను చేపట్టారు. సర్వీస్ రోడ్డుగా ఉపయోగించబడే గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు, 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లై ఓవర్‌ను చేపట్టారు. అదే విధంగా మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 522 మీటర్ల పొడవు, 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్‌సిటి మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. హెచ్కెసీ, మీనాక్షి టవర్ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది.
వచ్చే జూలై నాటికి కొండాపూర్ ఫ్లై ఓవర్
ప్రాజెక్టు స్టేజీ 2లో భాగంగా ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు 816 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో చేపడుతున్న ఫ్లై ఓవర్ పనులు కొనసాగుతున్నాయి. పాత గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌కు ఆనుకొని అప్ ర్యాంపు కొండాపూర్ వైపు 475 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఫ్లై ఓవర్, కొండాపూర్ నుంచి గచ్చిబౌలి డౌన్ ర్యాంపు 305 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్‌ను 2023, జూలై వరకు పూర్తి చేయనున్నారు.