సిటీబ్యూరో, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి ముందు సీఎం కుటుంబ సభ్యులకు వాటా ఉందంటూ.. వేసిన ఫ్లెక్సీల వ్యవహారం మరువక ముందే, తాజాగా నగరంలోని గీతా హ్యుందాయ్ షోరూంల ఎదుట మరోసారి ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. ‘675 ఎకరాలు.. రూ.8,528 కోట్ల హ్యుందాయ్ ప్రాజెక్టులో గీతా హ్యుందాయ్ వాటా ఎంత? అర్థమైందా రాజా?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోనే సీఎం సతీమణికి గీతాహ్యుందాయ్ డీలర్ షిప్లో వాటా ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి.