పండుగల వేళ ఆవహించే తీపి పరిమళాల వెనుక ఇంత చేదు నిజం దాగి ఉందా ఉందా? ప్రజలు అమాయకంగా, లొట్టలేసుకుంటూ తింటున్న పేనీలు ఎంత ప్రమాదకరమో? అవి ఏ వాతావరణంలో తయారవుతున్నాయో తెలిస్తే గుండె తల్లడిల్లాల్సిందే! ముఖ్యంగా దీపావళి పండగ వస్తుందంటే ఇళ్లల్లో నోరు తీపి చేసుకునేందుకు పేనీలు కొనుగోలు చేయడం సహజం. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని, పసి పిల్లల నుంచి వృద్ధుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న కల్తీ రాయుళ్లపై రాష్ట్ర ఆహార భద్రతా విభాగం, ఎన్ ఫోర్స్ మెంట్, టీజీ సేఫ్ అధికారులు ఒకసారిగా ఉకుపాదం మోపారు.
నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 12 పేనీ, ఖారా తయారీ యూనిట్లపై గురువారం ఉదయం 11 గంటల నుంచి రాష్ట్ర ఆహార భద్రతా విభాగం, ఎన్ ఫోర్స్ మెంట్, టీజీ సేఫ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆకస్మిక తనిఖీల్లో అధికారులకు కనిపించిన దృశ్యాలు వారిని సైతం నిర్ఘాంతపోయేలా చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆరు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఐదు సంస్థలకు సంబంధించిన వ్యాపార సంస్థలను శాశ్వతంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 1950 కిలోల పేనీలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ తయారీ కేంద్రాల్లో మెజారిటీ యూనిట్లకు అసలు ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ లైసెన్సులే లేవని తనిఖీల్లో తేలింది. అత్తాపూర్ భరత్‌నగర్ కాలనీ గణేష్ ఖారా అండ్ పెనీ, శివరాంపల్లి శ్రీకృష్ణ నగర్లో జేపీ ఫుడ్స్, మధుభన్ కాలనీలో జైపూర్ జోద్పూర్ పెనీవాలా, జియాగూడ ఇమామ్పురా జేపీ ఫుడ్స్, జియాగూడ జేపీ ఫుడ్స్, జియాగూడ భరత్‌నగర్ అంజనీ ఫుడ్స్, మహబూబ్‌గంజ్ రాంనివాస్ పూరీ స్వీట్స్ పేనీవాలా, బేగంబజార్ జీఎం మిక్చర్స్, చార్మినార్ పేట్లబుర్జు ప్రేమ్ పూరీ స్వీట్స్ పానీ, మూసారంబాగ్లో , బడంగ్‌పేట, అత్తాపూర్ జీఎం మిక్సర్, జియాగూడ భగీరథ ఫుడ్స్లపై తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, ఎలాంటి నిబంధనలు పాటించకుండా దొంగచాటుగా ఈ దందాను సాగిస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్ ఉన్న అతికొద్ది చోట్ల కూడా వాటిని ప్రజలకు కనిపించేలా ప్రదర్శించకుండా నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపారు. అనేక వ్యాపార సంస్థల్లో గుట్కా, పాన్ మసాలా, ఉమ్మి వేసిన మరకలు, కీటకాలు సంచరిస్తున్నట్లు తేల్చారు. సమాజంలో మనుషుల ప్రాణాలకు కనీస విలువ ఇవ్వకుండా, కేవలం లాభాపేక్షతోనే ఇలాంటి విషపూరిత వాతావరణంలో ఆహారాన్ని తయారు చేస్తున్న సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీజీ సేఫ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు స్పష్టం చేశారు. గ్రేటర్ వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాల్లో ఉన్న వ్యాపార సంస్థలపై దాడులు కొనసాగిస్తామన్నారు.
మన ఇంట్లో ఒక చిన్న పదార్థం చేసేటప్పుడు కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తాం. కానీ, వేలాది మంది కడుపుల్లోకి వెళ్లే ఈ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న ఖారానాల్లో కనీస మానవత్వం, బాధ్యత కానరాకుండా పోయాయని అధికారులు తెలిపారు. మురికి కాలువలు, దుమ్ము, ధూళి పడుతున్న అపరిశుభ్రమైన ప్రాంగణాల్లోనే ఈ పేనీలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సంబంధిత ఆహార పదార్థాలు తయారు చేసే కార్మికులు తలకు క్యాప్‌లు కానీ, చేతులకు గ్లోవ్స్ కానీ ధరించడం లేదని వెల్లడించారు. తయారీ చేసే మనుషులు ఒంటి నిండా చెమటతో, ఉతికి రోజులు గడిచిన మురికి బట్టలతోనే కార్మికులు పిండి కలపడం, పేనీలను తయారు చేయడం చూసి అధికారులు దిగ్భ్రాంతి చెందారు. ఆ చెమట చుకలే మనం తినే ఆహారంలో కలుస్తున్నాయనే చేదు నిజాన్ని అధికారులు గుర్తించారు. ఈగలు వాలుతున్న, మురికిగా ఉన్న నేలపైనే మైదా, నూనె వంటి ముడిపదార్థాలను, తయారు చేసిన పేనీలను తెరిచి ఉంచినట్లు అధికారులు చెప్పారు.