బంజారాహిల్స్, అక్టోబర్ 19: నాలుగున్నరేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి స్కూల్ లోపల తిరిగే అవకాశం కల్పించి.. పరోక్షంగా లైంగికదాడికి కారణమైన స్కూల్ ప్రిన్సిపాల్ పైకూడా పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ బుధవారం రిమాండ్‌కు తరలించారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించింది. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న నాలుగున్నరేండ్ల బాలికపై గత కొంతకాలంగా అదే స్కూల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న భీమన రజినీకుమార్(34) లైంగికదాడికి పాల్పడుతున్నాడు. స్కూల్లోని డిజిటల్ క్లాస్ రూమ్‌లోకి తీసుకువెళుతూ రోజూ బాలిక పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో చిన్నారి తీవ్ర ఆందోళనకు గురైంది. బాలిక తల్లిదండ్రులు ఆరా తీయగా దారుణం బయటపడింది. ఈ వ్యవహారంపై బాలిక తల్లిదండ్రులు మంగళవారం స్కూల్ వద్దకు చేరుకుని నిందితుడికి దేహశుద్ధి చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు రజినీకుమార్‌తో పాటు స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిపై 376 (ఏబీ) రెడ్‌విత్ 5 (ఎం), 21 ఆఫ్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నిందితులిద్దరికీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశించింది
ప్రిన్సిపాల్ వైఖరి వల్లే..
నిందితుడు రజినీకుమార్ గత ఐదేండ్లుగా ఇదే పాఠశాలలో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. గత రెండేండ్లుగా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రజినీకుమార్ స్కూల్ మొత్తం తిరుగుతూ బాలికలను వేధించాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది. డ్రైవర్‌ను స్కూల్ లోపల తిరిగేలా ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ వైఖరిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాలిక తల్లిదండ్రులతో పాటు ఆ పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. చట్టప్రకారం నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
లైంగికదాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో నాలుగున్నరేండ్ల బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. సభ్యసమాజం తలదించుకునేలా బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్కూళ్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.