సైదాబాద్, జూన్ 23 : ఏటీఎంలకు నగదు సరఫరా చేసే క్యాష్ వాహన డ్రైవర్ రూ.17 లక్షల నగదుతో పరారైన సంఘటన మంగళవారం ఐఎస్ సదన్ పీఎస్ పరిధిలో కలకలం రేపింది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సాయిప్రకాశ్గౌడ్ కథనం ప్రకారం.. ఎస్బీఐ బ్యాంక్ క్యాష్‌ను ఏటీఎంలలో డిపాటిట్ చేసే టీమ్ పోస్ ఏజెన్సీలో కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ 4 నెలల క్రితం డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం బాలానగర్‌లో నివాసముంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో సంతోష్‌నగర్-రెయిన్ బజార్ ప్రధాన రహదారిపై ఉన్నఎస్‌బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చారు. ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయ డానికి వెళ్తున్న సమయంలో ముందుగా వేసుకున్న ప్రథకం ప్రకారం వాహన డ్రైవర్ శ్రీనివాస్ అక్కడికి ముందుగానే పిలిపించుకున్నబైక్పై అదను చూసి రూ.17లక్షలు ఉన్న బ్యాగ్‌ను తస్కరించి పరారయ్యాడు.
వెంటనే టీమ్ పోస్ ఏజెన్సీ సంస్థ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఐఎస్ సదన్ పీఎస్ ఎస్ఐ సాయి ప్రకాశ్‌గౌడ్ స్పాట్‌కు చేరుకొని సీసీ పుటేజ్, వివరాలను సేకరించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమోరాల ఫుటేజీలను ఆధారంగా పరారైన డ్రైవర్ శ్రీనివాస్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సాయి ప్రకాశ్ గౌడ్ తెలిపారు.