సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈనెల 13 నుంచి 15వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉజ్జయిని మహంకాళి ఆలయం చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల వరకు వీధుల్లో పెద్ద ఎత్తున భక్తుల రద్దీ ఉండడంతోపాటు వాహనాలు కూడా రోడ్లపై ఉండే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైళ్లలో వెళ్లే ప్రయాణికులు ట్రైన్ సమయం కంటే కొంత ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలని, చిలకలగూడవైపు ఉన్న ప్లాట్‌ఫామ్ నంబర్- 10 నుంచి స్టేషన్లోకి ప్రవేశం ఉంటుందని, ప్లాట్‌ఫామ్ నంబర్- 1 వైపు అధికంగా భక్తుల రద్దీ ఉంటుందని జోయల్ డేవిస్ తెలిపారు. మరోవైపు కర్బాలా మైదాన్, రాణిగంజ్, ఓల్డ్ రామ్‌గోపాల్‌పేట పీఎస్, పారడైజ్, సిటిఓ, ప్లాజా, ఎస్బీఐ క్రాస్‌రోడ్, వైఎంసీఏ క్రాస్‌రోడ్, సెయింట్‌జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్, ప్యాట్నీ క్రాస్‌రోడ్, పార్క్‌లేన్, బాటా, ఘాస్మండి క్రాస్‌రోడ్స్, బైబిల్ హౌస్, మినిస్టర్స్ రోడ్, రసూల్‌పుర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఈనెల 13న తెల్లవారుజాము నుంచి 15 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జాయింట్ కమిషనర్ తెలిపారు. టొబాకొ బజార్ నుంచి మహంకాళి టెంపుల్వైపు వెళ్లే రోడ్డు, బాటా క్రాస్ రోడ్డు నుంచి రోచబజార్ వరకు వెళ్లే సుభాష్ రోడ్డు, మహంకాళి నుంచి అదవయ్య క్రాస్‌రోడ్డు, మహంకాళి నుంచి జనరల్ బజార్ వెళ్లే రోడ్డును రెం డురోజుల పాటు బంద్ చేస్తున్నామని, వాహనదారులు గమనించాలని కోరారు. పలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను మహంకాళి ఆలయం వైపు వచ్చే దారుల్లోకి వెళ్లకుండా మళ్లిస్తున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు.
బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చే భక్తులు ప్రాంతాల వారీగా హరిహరకళాభవన్, మహబూబ్కాలేజి, ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియా హై స్కూల్, ప్రభుత్వ అడవయ్య మెమోరియల్ హై స్కూల్, మహాత్మాగాంధీ విగ్రహం వద్ద, ఎంజీరోడ్‌లోని పార్సీ స్కూల్, నల్లగుట్ట జీహెచ్ఎంసీ గ్రౌండ్, వెస్లీ కాలేజి గ్రౌండ్, స్వప్నలోక్ కాంప్లెక్స్ , తాజ్ట్రై స్టార్ లేన్, బెల్సన్ తాజ్ హోటల్ లేన్, సీఎంఆర్ షాపింగ్ మాల్ పార్కింగ్ ప్లేస్‌లలో పార్క్ చేసుకోవాలని, వాహనదారులు తమ ప్రయాణాలను ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలని జోయల్ డేవిస్ కోరారు.