సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ఏటేటా ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఐటీ కారిడార్ విస్తరించి ఉన్న ప్రాంతాల్లోని ఇంటర్‌చేంజ్‌ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్ఆర్పై 19 చోట్ల ఇంటర్‌చేంజ్‌లను నిర్మించగా, అందులో మొదటి ఇంటర్చేంజ్ కోకాపేట వద్ద ప్రారంభమవుతున్నది. కోకాపేట నుంచి కొల్లూరు, ముత్తంగి, దుండిగల్ మీదుగా మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్కేసర్, పెద్దఅంబర్‌పేట, బొంగుళూరు. తుక్కుగూడ, పెద్ద గోల్కొండ, శంషాబాద్, రాజేంద్రనగర్, తెలంగాణ పోలీస్ అకాడమీ, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ఇంటర్‌చేంజ్‌లను నిర్మించారు. కాగా, వీటిలో నగరానికి పడమర దిక్కు ఉన్న ఐటీ కారిడార్‌లో నార్సింగి, నానక్‌రాంగూడ, కోకాపేట ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి ఐటీ రంగం గణనీయంగా వృద్ధి చెందడంతో పాటు నగరాభివృద్ధి అంతా ఐటీకారిడార్ వైపే ఉంది. దీంతో ఒక్కసారి గణనీయంగా ట్రాఫిక్ రద్దీ నానక్‌రాంగూడ, కోకాపేట,నార్సింగి ప్రాంతాల్లో పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన హెచ్ఎండీఏ ఇప్పటికే నార్సింగి వద్ద కొత్తగా ఇంటర్‌చేంజ్‌ను నిర్మిస్తున్నది. కాగా, కోకాపేటలో ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 కూడలి అటు ఫైనాన్సియల్ డిస్ట్రక్ మీదుగా గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ వరకు, ఇటు కోకాపేట గోల్డెన్ మైల్ లేఅవుట్, నియోపోలీస్ లేఅవుట్, గండిపేట, శంకర్పల్లి, మోకిల వంటి ప్రాంతాలకు వెళ్లే వారంతా కోకాపేట ఎగ్జిట్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.
కోకాపేట ఎగ్జిట్ 1 వద్ద పెరిగిన వాహనాల రద్దీ..
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ రోడ్డు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ మీదుగా కోకాపేట ఎగ్జిట్-1 అనుసంధానమై ఉంది. గత 9 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున రావడమే కాకుండా భారీ బహుళ అంతస్థుల వ్యాపార, వాణిజ్య భవనాలకు తోడు నివాస భవనాలు సైతం 58 అంతస్తుల వరకు ఉన్నాయి. దీంతో కోకాపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద వాహనాలు సాఫీగా పైకి వెళ్లేందుకు, కిందకు దిగేందుకు అనుకూలమైన మార్గాలు సరిగా లేవు. ముఖ్యంగా కోకాపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద జీఏఆర్ (ఘర్ ఇన్పోబామ్) రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మించిన ఐటీ టవర్‌కు వెళ్లాలంటే సరైన మార్గం లేదు. దీంతో సుమారు 3 కి.మీ దూరం తిరిగి రావాల్సి వస్తున్నదని వాహనదారులు వాపోతున్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కోకాపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1ను రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ వాహనదారుడు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్‌కు ట్వీట్ చేస్తే, దీన్ని పరిశీలిస్తామని ఆయన సమాధానం ఇచ్చారు. ఇలా ఒక్కరే కాదు నిత్యం వేలాది గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ వైపు నుంచి కోకాపేట వచ్చే వాహనదారులు ఇలాంటి సమస్యనే ఇక్కడ ఎదుర్కొంటున్నారు.