సిటీబ్యూరో, డిసెంబరు 4 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో గ్రేటర్లో సోమవారం అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. రాగల 24 గంటల్లో తుఫాను ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. వర్షం కారణంగా నగరంలో వాతావరణం చల్లబడింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 27.5డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5డిగ్రీలు, గాలిలో తేమ 66శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.