సైబరాబాద్ పబ్బుల్లో వేడుకలపై చిట్టా సేకరిస్తున్న పోలీసులు
పార్టీలపై మూడంచెల నిఘా
‘బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్’ కల్చర్‌పై పోలీసుల ఆరా
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే సీపీ స్టీఫెన్ రవీంద్ర
సిటీబ్యూరో, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో రాడిసన్ బ్లూ హోటల్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పబ్ కల్చర్ పై పెద్ద దుమారం రేగుతున్నది. హైదరాబాద్ తర్వాత సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలీ, మాదాపూర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, నానక్రాంగూడా ప్రాంతాల్లో పబ్ కల్చర్ అధికంగా ఉన్నది. ఈ ప్రాంతంలో నడుస్తున్న 18 పబ్‌లతో పాటు రిసార్టులు, ఫాంహౌజ్‌లు, గెస్ట్‌హౌజ్‌లలో జరిగే వేడుకలకు సంబంధించిన రోజు వారి కార్యక్రమాల చిట్టాను పోలీసులు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. పార్టీకి ఎంతమంది హాజరవుతున్నారు. నిర్వాహకుడు ఎవరు., ఎవరి పేరు మీద అద్దెకు తీసుకుంటున్నారు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా వేడుకల్లో మద్యం పార్టీ ఉంటే ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమతి తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
వేడుకల్లో ఆకస్మిక తనిఖీలు
పబ్‌లు, బార్లు, స్టార్ హోటల్స్‌లో జరుగుతున్న పార్టీలు, వేడుకలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్థానిక జోన్ డీసీపీ, ఏసీపీ, స్థానిక పీఎస్ ఇన్స్పెక్టర్, సెక్టార్ ఎస్ఐ సేకరిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే వెంటనే చట్టపరంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా వారం రోజుల్లో ఒకటికి రెండు సార్లు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. సమయపాలన విషయంలో నిమిషం ఆలస్యమైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా డెకాయ్ అపరేషన్ సైతం నిర్వహిస్తూ.. పార్టీలు, వేడుకలపై మూడంచెల నిఘా ఉంచారు.
కొత్తగా బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్’ రూంలు
కరోనా తర్వాత ఆర్థికంగా కొంత ఇబ్బందులు తలెత్తడంతో ఇప్పుడు సైబరాబాద్ పరిధిలో ఎయిర్ బీఎన్బీ (ఎయిర్ బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్) సంస్కృతి ప్రారంభమైంది. చాలా మంది ఐటీ ఉద్యోగులు పబ్‌లకు వెళ్లి జల్సా చేయాలంటే ఆర్థిక భారం అవుతుండటంతో ఇప్పుడు ఈ ఎయిర్ బీఎన్బీ సంప్రదాయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఎయిర్ బీఎన్బీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కొంత మంది ఓ గ్రూపుగా ఏర్పడి అపార్ట్మెంట్లలోని ఫ్లాట్స్, ఇండిపెండెంట్ ఇండ్లు, ఫాంహౌజ్‌లను వీకెండ్లో అద్దెకు తీసుకుని అందులో పార్టీలు చేసుకుంటున్నారు. వీటిలో అన్ని సౌకర్యాలు ఉండటంతో వేడుకలను నిర్వహించుకునే వారు అక్కడే అక్కడే స్టే చేస్తున్నారు. ఇలా రెండు రోజుల పాటు అద్దెకు తీసుకుంటూ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ కల్చర్‌పై కూడా సైబరాబాద్ పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఎయిర్ బీఎన్బీ ద్వారా సైబరాబాద్ పరిధిలో దాదాపు 20 ప్రాంగణాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. వాటిని వారాంతపు పార్టీలకు ఎవరెవరు బుక్ చేసుకుంటున్నారు ? ఎంతమంది హాజరవుతున్నారు.? నిర్వాహకుల బ్యాక్ గ్రౌండ్‌ను ఏమిటనే విషయాలు సేకరిస్తున్నారు.? అనే కోణాల్లో అకస్మిక తనిఖీలు చేస్తున్నారు.
94906 17444 కు సమాచారం ఇవ్వండి
సైబరాబాద్ పరిధిలో మత్తు వ్యవహారాలు నడవకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్, గంజాయి వంటి వాటితో పార్టీలు జరుగకుండా పటిష్ట నిఘాను ఏర్పాటు చేసుకున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు. పబ్‌లు, రిసార్ట్స్, ఫాంహౌజ్‌లు, గెస్ట్ హౌజ్‌లలో జరిగే వేడుకల పై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాం. అశ్లీల, అభ్యంతకరమైన, మత్తుతో జరిగే వేడుకలపై సమాచారం ఉంటే సైబరాబాద్ వాట్సాప్ 94906 17444 కు సమాచారం అందించాలి.
-స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీసు కమిషనర్