Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : నగరవాసులు అందానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కుటుంబ సమేతంగా సెలూన్స్, పార్లర్స్‌కు వెళ్లడంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని సెలూన్స్ సైతం సౌందర్య సంరక్షణకు అంతర్జాతీయ ప్రమాణాలు జోడిస్తున్నాయి. సామాన్యులను సైతం సెలబ్రెటీలుగా తీర్చిదిద్దడానికి విభిన్న రకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇదే క్రమంలో గ్రేటర్లో విస్తృతంగా ట్రెండింగ్ సెలూన్స్ వెలుస్తున్నాయి.
ముఖ్యంగా యునిసెక్స్ సెలూన్స్‌కు నగరంలో డిమాండ్ ఉంది. వీకెండ్ వచ్చిందంటే ఫ్యామిలీ అంతా సెలూన్‌కు వెళ్లి అందంగా కనిపించేందుకు తహతహలాడుతున్నారు. అలంకరణ మీద ఒక కుటుంబం సుమారుగా నెలకు రూ.20వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా హెయిర్ కేర్, స్కిన్, బాడీ కేర్, హెయిర్ కలరింగ్, గ్రూమింగ్, స్పా, హెయిర్ స్పా, నేయిల్ ఆర్ట్, హెయిర్ ైస్టెలింగ్, మానిక్యూర్, మేకప్, డెటన్, పెడిక్యూర్, మెనిక్యూర్, ప్రీమియం ఫేషియల్స్, ఫేషియల్స్, క్లిన్అప్స్, హెయిర్ ఫార్మ్స్, వెల్ల హెయిర్ స్పా తదితర సేవలను అందిస్తున్నాయి.
ఇంటర్నేషనల్ జ్యూసి సెలూన్, హబీబ్ లాంటి సెలూన్ బ్రాంచీలు నగరంలో మరిన్ని ప్రారంభమయ్యాయి. వీటి సరసన ఇంకొన్ని అత్యాధునిక సెలూన్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏసీ గదులు, ఇంటీరియర్ డిజై న్స్, పూల మొక్కలు, విశాలమైన గదులు ఇలా అన్ని రకాలుగా ఆకట్టుకునేల సెలూన్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. వేయిటింగ్ కస్టమర్లకు బోర్ లేకుండా మ్యాగ్జిన్స్, టీవీ, పజిల్స్ లాంటి సేవలను అందిస్తున్నారు. అంతేకాదు ధరలు కూడా మెనూలో పొందుపర్చి సేవలను అందిస్తున్నారు.
అలంకరణకు సోషల్ మీడియా ప్రధానంగా కనిపిస్తున్నది. అందంగా తయారై ఫొటోలు దిగి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాలో షేర్ చేయడమనే ఆసక్తి విరివిగా పెరిగింది. ఒక్కో ఫొటోలో ఒక్కో లుక్ ఉండేల అలంకరణపై దృష్టి పెడుతున్నారు. లైక్స్, కామెంట్స్ వచ్చేల ట్రెండీ లుక్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అందంగా కనిపించడం కోసం బ్యూటీప్రొడక్ట్స్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరిగింది. సినిమాల్లో హీరోలను అనుసరిస్తూ గ్రూమింగ్ ఫాలో అవుతున్న వారూ ఉన్నారు. ఆత్మవిశ్వాసంగా కనిపించడంలోనూ అలంకరణ ప్రధాన పాత్ర పోషిస్తున్నది.
అమోనియా ఫ్రీ రూ.1000, ఫ్యాషన్ కలర్ రూ.1200, క్రిస్టల్ పెడిక్యూర్ రూ.1000, హీల్ పీల్ రూ.1500 ఉన్నాయి. రేడియంట్ ఫేషియల్ రూ.3,500, గ్లో రూ.3,500, ఆక్సీజన్ ఫేషియల్ రూ.4,500, స్రెయిటనింగ్ 3 వేల నుంచి 12 వేల వరకు చార్జీ చేస్తారు.
అలంకరణ అనేది అమ్మాయిలకే పరిమితం కాలేదు. మహిళలతో సమానంగా ట్రెండీ ైస్టెల్‌గా కనిపించేందుకు పురుషులు కూడా ఇష్టపడుతున్నారు. పండుగలు, వేడుకల్లోనూ ఆ మార్పు ఇటీవల కాలంలో మొదలైంది. కుర్రకారుతో పోటీ పడేందుకు యువకులుగా కనిపించేందుకు 40 ఏండ్లు పైబడిన వారు కూడా అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
-సునీత, నిర్వాహకురాలు
చాలా కంపెనీలు పనిలో నైపుణ్యం, ప్రతిభను పరిగణలోకి తీసుకునేవి. మారిన పరిస్థితుల్లో ఎన్నో రంగాల్లో ఉద్యోగాలు వచ్చాయి. నైపుణ్యం, ప్రతిభతో పాటు అందంగా కనిపించడం కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. వినియోగదారులతో నేరుగా సంబంధాలు ఉండే కొలువుల్లో చక్కగా సిద్ధం కావడం, రోజంతా హుషారుగా ఉండటం అదనపు అర్హతగా భావిస్తున్నారు. ఇప్పుడు అలంకరణ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది.
-శ్రావ్యరెడ్డి, ఫౌండర్, ఇంటర్నేషనల్ జ్యూసి సెలూన్ సెంటర్