ఉస్మానియా యూనివర్సిటీ : పట్టపగలే వృద్ధురాలి కళ్లల్లో కారం చల్లి చైన్ లాక్కెళ్లిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ చోటు చేసుకుంది. ఓయూ ఇన్స్పెక్టర్ రమేశ్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం తార్నాక డివిజన్ లాలాపేటలోని వినోబానగర్లో బాధితురాలు (70) నివాసముంటోంది.
తన ఇంటి పక్కనే టు-లెట్ బోర్డ్ ఉండడంతో అది చూడడానికి వచ్చానని చెప్పిన దుండగుడు మొదటి అంతస్థులో నివాసముండే బాధితురాలి వద్దకు వచ్చి తాగడానికి మంచినీళ్లు అడిగారు. మంచినీళ్లు తీసుకువచ్చిన మహిళ కళ్లల్లో కారం చల్చి మెడలో ఉన్న మూడు తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు.
వృద్ధురాలి కేకలు విని ఇరుగుపొరుగు వచ్చేటప్పటికే దుండగుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.