సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ శివారులకు పూర్తి స్థాయిలో బస్సులు అందుబాటులో ఉండటం లేదు. రెండు, మూడు బస్సులు మారితేగాని గమ్యాన్ని చేరుకోలేకపోతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు సదుపాయం కల్పించాలని ఇప్పటికీ సంబంధిత డిపోల మేనేజర్ కార్యాలయాలకు శివారు ప్రాంతాల వాసులు అనేక సార్లు వినతి పత్రాలు అందించారు. శివార్ల నుంచి నగరంలో పలు ప్రధాన మార్గాలకు బస్సులు నడపాలని ప్రజలు కోరుతున్నారు. ఉద్దేమర్రి, హుషారుపల్లి, ఆదిబట్ల, దుండిగల్, మోకీల,శంకర్పల్లి, కొల్లూర్ నియోపోలిస్ సమీపంలోని ప్రాంతాలకు సమయపాలన లేని అరకొర బస్సులు కాకుండా సరిపడా నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆక్యుపెన్సీ లేదంటూ ఉన్న బస్సులను కుదిస్తున్నారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
211బీ బస్సు గతంలో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ జిల్లాలోని ఉద్దేమర్రి వరకు నడిచేది. ప్రస్తుతం ఈ సర్వీస్‌ను తగ్గించి కేవలం ఉదయం వేళలో యాద్రాసిపల్లి వరకు పరిమితం చేశారు. మరోవైపు గండిమైసమ్మ నుంచి ప్రగతినగర్ మీదుగా రాంపల్లి, దమ్మాయిగూడ, బాలాజీనగర్‌కు బస్సులు సరిపడా ఉండటం లేదు. రాత్రి 9 దాటిందంటే ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. రోజులో చివరి ట్రిప్పు వచ్చే బస్సులు ముందుగానే వెళ్లిపోతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో తమ పరిస్థితి అయోమయంగా ఉంటుందని వివరించారు.
మరోవైపు కీసర సమీపంలోని వెంకటాపూర్-వెంకాయపల్లి ప్రాంతంలోని మేడ్చల్ కలెక్టరేట్‌కు జిల్లా ప్రజలు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదు. మూడుకిలో మీటర్ల దూరంలో బస్సు దిగి అక్కడ నుంచి ఆటోలో వెళ్లాల్సి వస్తుందని ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ వంటి ప్రాంతాల ప్రజలు కార్యాలయానికి వెళ్లాలంటే సికింద్రాబాద్ మీదుగా ఈసీఐఎల్ లేదా కాప్రా మీదుగా రెండు మూడు బస్సులు మార్చి చేరుకోవాల్సి వస్తుందని వాపోయారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర శివార్లకు రాత్రి సమయాల్లో సైతం బస్సులు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.