TSIC | సిటీబ్యూరో, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) నిరంతరం కృషి చేస్తున్నది. తాజాగా ప్రపంచ సృజనాత్మకత, ఆవిష్కరణ దినోత్సవం(ప్రపంచ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే)ను పురస్కరించుకొని ఈనెల 21వ తేదీన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రజలు ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు చూపే ఆవిష్కరణల ఫొటోలను తీసి పంపించాల్సి ఉంటుంది. ఔత్సాహికులు మొబైల్లో ఫొటోగ్రఫీ, డీఎస్ఎల్ఆర్ ఫొటోగ్రఫీ ద్వారా ఆవిష్కరణలను వెతికి తీసి టీఎస్ఐసీకి పంపించాలని సూచించారు. ఈనెల 15వ తేదీ లోగా తమ దరఖాస్తులను పంపించాలని, మరిన్ని వివరాలకు లింకు (https://t.co/A5 DUHpcnk7)లో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.