గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 05, 2020 , 01:33:52

నకిలీ నోట్ల తయారీపై యూట్యూబ్‌లో పాఠాలు

నకిలీ నోట్ల తయారీపై యూట్యూబ్‌లో పాఠాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నకిలీ కరెన్సీని తయారు చేసి మార్కెట్‌లో చలామణి చేస్తున్న రెండు ముఠాలతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌.. మొత్తం 14 మందిని నార్త్‌జోన్‌, సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 17.77లక్షల నకిలీ కరెన్సీ, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సీపీ అంజనీకుమార్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీ చక్రవర్తితో కలిసి వివరాలను వెల్లడించారు. 

యూట్యూబ్‌లో చూసి... నకిలీ కరెన్సీ తయారీ

సంగారెడ్డి పట్టణంలో నివాసముండే ఇషాక్‌ బిన్‌ సల్హే 10వ తరగతి వరకు చదివాడు. ఇతని సహాయకుడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే గౌతమ్‌ కంప్యూటర్‌లో డిప్లమా పూర్తి చేశాడు. ఇద్దరు కలిసి నకిలీ కరెన్సీ తయారు చేసి హై దరాబాద్‌లో చలామణి చేయాలని ప్లాన్‌ చేశారు. ఇందుకు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ స్కానింగ్‌, పేపర్‌ కటింగ్‌, ఫ్రింటింగ్‌ గురించి నేర్చుకున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది మార్చిలో స్కానర్‌ కమ్‌ ఫ్రింటర్‌, పేపర్‌కట్టింగ్‌ మిషన్లను కొనుగోలు చేశారు. 100, 200 అసలైన నోట్లను స్కానింగ్‌ చేసి, ఫ్రింట్‌ తీస్తూ నకిలీ కరెన్సీని తయారు చేయడం ప్రారంభించారు. ఇలా తయారు చేసిన నకిలీ కరెన్సీ నోట్ల కట్టల్లో పైన అసలైన నోట్లు, మధ్య లో నకిలీ నోట్లు పెట్టి ముఠా సభ్యులు మహ్మద్‌ సోహెల్‌ అలీ, మహ్మద్‌ గౌసుద్దీన్‌, అక్బర్‌ ఖాన్‌, సయ్యద్‌ కాసీఫ్‌ బహుదూర్‌తో పాటు మరో ముగ్గురు బాలలతో  సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశివపేట, హైదరాబాద్‌ ప్రాంతాల్లో చలామణి చేయిస్తున్నారు. 1:3 శాతం చొప్పున ఈ నకిలీ నోట్లను గ్యాంగ్‌ మార్కెట్లో అమాయకులకు ఇస్తున్నారు. అబిడ్స్‌లోని జగదీష్‌మార్కెట్‌ ప్రాంతంలో సయ్యద్‌ కాసీఫ్‌తో పాటు ఇద్దరు బాలలు నకిలీ కరెన్సీని చలామణి చేస్తుండగా నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు బృందానికి సమచారం అందడంతో ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సూత్రధారులు పోలీసులకు చిక్కారు. 9 మంది సభ్యులు కల్గిన ఈ  ము ఠాను అరెస్ట్‌ చేసి రూ. 9.27 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీ నం చేసుకొని, తదుపరి విచారణకు ఈ కేసును అబిడ్స్‌ పోలీసులకు అప్పగించారు. 

సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన మరో గ్యాంగ్‌ 

మెహిదీపట్నంలో నివాసముంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రం చేసే బీవీ శివ సందీప్‌, ఆసిఫ్‌నగర్‌కు  చెందిన ఎండీ అక్బర్‌ పాషా, మహ్మద్‌ మొహిన్‌, మహ్మద్‌ రజీయుద్దీన్‌ గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. అసలైన 2000, 500 నోట్లను

 స్కాన్‌ చేసి.. దాని ద్వారా కలర్‌ ఫ్రింట్‌ను తీసి నకిలీ నోట్ల ను చలామణి చేస్తున్నారు. మార్కెట్‌లో 1:2 శాతం చొప్పు న నకిలీ నోట్లను చలామణి చేస్తుండడంతో సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్‌ చేశారు. వీరి  నుంచి రూ. 8.5 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 

బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి చలామణి..

పశ్చిమబెంగాల్‌ మల్దా జిల్లాకు చెందిన అమీన్‌ ఉల్‌ రహమాన్‌ పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో తయారుచేసిన నకిలీ కరెన్సీతో అక్రమ మార్గంలో దేశంలోకి చొరబడి, వాటిని వివి ధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్నాడు. ఇతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 8 కేసులు నమోదయ్యాయి. అమీన్‌ సహచరుడిగా ఉన్న మహ్మద్‌ గౌస్‌ను 2019లో చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు, అయితే సూత్రధారి అమీన్‌ పరారీలో ఉండడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని  చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. 

 జాగ్రత్తగా ఉండండి : సీపీ

అసలు, నకిలీ నోట్ల తేడాను గుర్తించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. కలర్‌ ఫ్రింట్‌ తీసి వాటిని చలామణి చేస్తున్నారు. నకిలీ నోట్లలో వాటర్‌ మార్క్‌ మెరువదు. నోటు కలర్‌ సరిగ్గా ఉండదు. భారత్‌ అని రాసే అక్షరాల్లో తేడా ఉంటుంది. అసలు నోట్లలో వాటర్‌ మార్క్‌ మెరుస్తుంది, కలర్‌ కూడా రెండు రకాలుగా ఉన్నట్లు కన్పిస్తాయి. అసలు, నకిలీ నోట్ల కు తేడా గురించి ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం ఉంటుందని సీపీ తెలిపారు.


logo