Liver Cirrhosis | లివర్ సిర్రోసిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో ఆరోగ్యకరమైన లివర్ కణజాలం క్రమంగా గాయపడి స్కార్ టిష్యుగా మారుతుంది. ఇది ఎక్కువకాలం పాటు లివర్‌లో జరిగే ఇన్ఫ్లమేషన్ (వాపు) వల్ల జరుగుతుంది. మద్యం వినియోగం, ఊబకాయం లేదా ఇన్ఫెక్షన్లు దీని ప్రధాన కారణాలు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రెండింటి వల్ల కూడా ఇది వస్తుంది. ఫ్యాటీ లివర్ ను సాధారణంగా తిరిగి సరిచేసుకోవచ్చు, కానీ సిర్రోసిస్ వల్ల కలిగే నష్టం చాలా సందర్భాల్లో శాశ్వతంగా ఉంటుంది. అయితే తొందరగా గుర్తిస్తే ఆహారం, వ్యాయామం వంటి మార్పులతో నియంత్రణలో ఉంచవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు కొన్ని ఆహారాలను పూర్తిగా నివారించడం చాలా ముఖ్యం. ఇవి లివర్‌పై మరింత ఒత్తిడి పెంచి పరిస్థితిని కష్టతరం చేస్తాయి.
మొదటగా అధిక ఉప్పు (సోడియం) ఉన్న ఆహారాలను దూరంగా ఉంచాలి. సోడియం అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిల్వ అవుతుంది. దీంతో పొట్టలో నీరు చేరడం (అసైటిస్), కాళ్ల వాపు వంటి సమస్యలు పెరుగుతాయి. టిన్ సూప్స్, చిప్స్, నమకీన్, పచ్చళ్ళు, ఇన్స్టంట్ నూడుల్స్, బయటి భోజనం వంటి వాటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. రోజుకు 1500-2000 మి.గ్రా కంటే ఎక్కువ సోడియం తీసుకోవడం ప్రమాదకరం. అలాగే మద్యాన్ని పూర్తిగా నిషేధించాలి. చిన్న మోతాదులోనైనా తీసుకోవడం లివర్‌లో మిగిలిన ఆరోగ్యకర కణాలను కూడా దెబ్బతీస్తుంది. ఇది ఫైబ్రోసిస్‌ను వేగంగా పెంచి, విషపదార్థాలు శరీరంలో పేరుకుపోయేలా చేస్తుంది. ఒక్కసారి తాగినా అమోనియా స్థాయిలు పెరిగి అలసట, గందరగోళం పెరుగుతాయి. కాబట్టి మద్యం పూర్తిగా మానేయడం తప్పనిసరి.
అదే విధంగా ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలు కూడా హానికరం. ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, సమోసాలు, బర్గర్లు వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్‌లో కొవ్వు పేరుకుపోయేలా చేసి ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. పదేపదే వేయించిన నూనెల్లో ఉండే ఫ్రీ రాడికల్స్ లివర్ కణాలను దెబ్బతీస్తాయి. అందుకే ఆవిరి వంటలు, ఉడికించినవి లేదా తక్కువ నూనెలతో చేసిన వంటలను తీసుకోవడం మంచిది. ఎర్ర మాంసం (మటన్), ప్రాసెస్ చేసిన మాంసాహారం కూడా తగ్గించాలి. బీఫ్, మటన్, పోర్క్, సాసేజ్, సలామీ వంటి వాటిని జీర్ణించుకోవడం కష్టమవుతుంది. ఇవి సాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అధికంగా కలిగి ఉండి లివర్‌పై ఒత్తిడిని పెంచుతాయి. వీటి బదులు పప్పులు, టోఫు, గుడ్డు తెల్లసొన వంటి లైట్ ప్రోటీన్ వనరులు మంచివి. అలాగే అరగని లేదా సరిగా వండని ఆహారాలు కూడా ప్రమాదకరం. సిర్రోసిస్ ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి పచ్చి సీఫుడ్, సుషీ, సగం వండిన గుడ్లు, మొలకలు వంటి వాటి ద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి అన్నీ బాగా వండి తీసుకోవాలి.
చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు కూడా తగ్గించాలి. సోడాలు, మిఠాయిలు, పేస్ట్రీలు, మైదాతో చేసిన పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి ఫ్యాటీ లివర్ సమస్య మరింత పెరుగుతుంది. ఫ్రక్టోజ్ అధికంగా ఉన్న పదార్థాలు లివర్ కణాలకు హానికరం. కాబట్టి పరిమితంగా మాత్రమే సహజ ఫలాలను తీసుకోవాలి. అలాగే అధిక కొవ్వు ఉన్న పాల పదార్థాలు, అనారోగ్యకర కొవ్వులను కూడా నివారించాలి. పూర్తి పాలు, వెన్న, నెయ్యి, క్రీమీ చీజ్ వంటి వాటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి లివర్ పనితీరును దెబ్బతీస్తాయి. పామ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటి వాటి వినియోగాన్ని తగ్గించి, స్కిమ్డ్ మిల్క్ లేదా లో-ఫ్యాట్ ఆప్షన్లను ఎంచుకోవడం మంచిది. లివర్ సిర్రోసిస్ ఉన్నవారు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సరైన ఆహారపు అలవాట్లు, నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలి ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచడం సాధ్యమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.