GLP-1 Medicine | బరువు తగ్గేందుకు ఉపయోగించే ఒజెంపిక్, మొంజారో వంటి మందులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. టైప్-2 డయాబెటిస్ చికిత్స కోసం రూపొందించిన ఈ ఔషధాలను చాలామంది బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తున్నారు. అయితే అందరికీ ఇవి ఒకే విధంగా పనిచేయవు. కొందరు ఈ మందులతో శరీర బరువులో 20 శాతం వరకు తగ్గుదల చూస్తుంటే, మరికొందరికి మాత్రం తక్కువ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ తేడాకు కారణం జన్యువులే కావచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. తాజాగా నిర్వహించిన పరిశోధనలో, ఈ మందులకు శరీరం ఎలా స్పందిస్తుందో వ్యక్తుల జన్యువులు ప్రభావితం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 28 వేల మంది రోగుల డీఎన్ఏ నమూనాలను పరిశీలించిన పరిశోధకులు, కొన్ని ప్రత్యేక జన్యు మార్పులు ఉన్నవారిలో బరువు తగ్గడం ఎక్కువగా జరిగిందని గుర్తించారు. మరికొంతమందిలో మాత్రం వికారం, వాంతులు వంటి దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపించాయని వెల్లడించారు. ఈ అధ్యయనం నేచర్ జర్నల్లో ప్రచురితమైంది.
ఒజెంపిక్, వెగోవీ మందుల్లో సెమాగ్లూటైడ్ (Semaglutide) అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో భోజనం చేసిన తర్వాత విడుదలయ్యే జీఎల్పీ-1 హార్మోన్లా పనిచేస్తుంది. ఈ హార్మోన్ మెదడుకు కడుపు నిండిన సంకేతాన్ని పంపుతుంది. ఫలితంగా ఆకలి తగ్గి, తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. సాధారణంగా ఈ మందులతో 10 శాతం వరకు బరువు తగ్గవచ్చని చెబుతున్నప్పటికీ, ఫలితాలు వ్యక్తి వ్యక్తికీ భిన్నంగా ఉంటున్నాయి. పరిశోధకులు నిర్వహించిన జీనోమ్-వైడ్ అసోసియేషన్ స్టడీ (GWAS)లో జీఎల్పీ1ఆర్ అనే జన్యువులో ఉన్న ఒక ప్రత్యేక మార్పు ఉన్నవారిలో బరువు తగ్గుదల మరింత ఎక్కువగా కనిపించిందని గుర్తించారు. ఈ జన్యు మార్పు ఉన్నవారిలో మందులు శరీరంపై బలంగా పనిచేసి ఆకలిని ఎక్కువగా తగ్గిస్తున్నాయని తెలిపారు. మరోవైపు, కొందరిలో మందులు సరిగా పనిచేయకపోవడానికి కారణం జన్యువుల వల్ల రిసెప్టర్లు మందులను తక్కువగా స్వీకరించడమేనని వివరించారు.
అలాగే జీఐపీఆర్ సంబంధిత జన్యువుల్లో మార్పులు ఉన్నవారిలో మొంజారో వాడినప్పుడు వికారం, వాంతులు వంటి సమస్యలు ఎక్కువగా కనిపించినట్లు అధ్యయనం తెలిపింది. అయితే ఈ జన్యు మార్పులు బరువు తగ్గుదలపై మాత్రం ప్రభావం చూపలేదని పరిశోధకులు పేర్కొన్నారు. నిపుణుల ప్రకారం, మన డీఎన్ఏ ఆకలి, కొవ్వు నిల్వలు, మెటబాలిజం వంటి అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. అందువల్లే కొందరు మందులకు త్వరగా స్పందిస్తే, మరికొందరిలో ప్రభావం తక్కువగా కనిపిస్తుంది. అయితే ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తాయని వారు గుర్తుచేస్తున్నారు. జన్యువులు కేవలం 5 నుంచి 10 శాతం వరకు మాత్రమే ప్రభావం చూపుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిశోధన భవిష్యత్తులో వ్యక్తిగత జన్యువుల ఆధారంగా బరువు తగ్గించే చికిత్సలు అందించే అవకాశాలకు మార్గం చూపుతోంది. భవిష్యత్తులో సాధారణ జన్యు పరీక్షల ద్వారా ఏ మందు ఎవరికి బాగా పనిచేస్తుందో ముందుగానే తెలుసుకునే అవకాశం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని వల్ల సరైన మందును ఎంపిక చేయడం, దుష్ప్రభావాలను తగ్గించడం, చికిత్స ఫలితాలను మెరుగుపరచడం సులభమవుతుందని చెబుతున్నారు.