Dry Fruits | డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సాధారణంగా భావిస్తారు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటం, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండటం, రోజంతా శక్తి నిల్వ ఉండటం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే డ్రైఫ్రూట్స్‌ను ఎప్పుడు తింటామనే విషయం కూడా వాటి ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందని, డ్రైఫ్రూట్స్‌ను సరైన సమయంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ ప్రయోజనం అందుతుందని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ ను ఏయే సమయంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బాదం గురించి చెప్పాలంటే, ఉదయం ఖాళీ కడుపుతో తినడం ఉత్తమ సమయంగా నిపుణులు సూచించారు. నానబెట్టిన బాదం తింటే మెటాబాలిజం వేగం పెరుగుతుంది. ఇవి శరీరానికి స్థిరమైన శక్తిని అందించడంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. అలాగే ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంచుతాయి. వాల్‌నట్స్‌ను సాయంత్రం సమయంలో తినడం మంచిది. ఇవి పోషకాలు శరీరంలో సులభంగా శోషించేందుకు సహాయపడతాయి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మెలటోనిన్ కలిగి ఉండటం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడంతోపాటు నిద్ర నాణ్యతను పెంచుతాయి. జీడిపప్పును మధ్యాహ్నం స్నాక్‌గా తీసుకోవడం ఉత్తమం. ఇవి మెగ్నీషియం, మంచి కొవ్వులు కలిగి ఉండి శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. అయితే రాత్రి సమయంలో వీటిని తినడం మంచిది కాదని, అధిక కొవ్వు, ప్రోటీన్ ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక పిస్తా విషయానికి వస్తే, ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి వీటిని తీసుకునే సమయం మారవచ్చు. సాధారణంగా పగటి సమయంలో స్నాక్‌గా తీసుకోవడం మంచిది. ఇవి ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండి శక్తిని నిల్వ ఉంచడంలో సహాయపడతాయి.సరైన డ్రైఫ్రూట్స్‌ను సరైన సమయంలో తీసుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. శక్తి స్థాయిలు మెరుగుపడటం, జీర్ణక్రియ బాగుపడటం, అవసరం లేని ఆకలి తగ్గడం, నిద్ర నాణ్యత పెరగడం, రోజంతా సమతుల్యమైన ఆహారపు అలవాట్లు ఏర్పడడం వంటి ప్రయోజనాలు అందుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏం తింటామన్నది మాత్రమే కాదు, ఎప్పుడు తింటామన్నది కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. చిన్న మార్పులు చేస్తే శరీరం ఇచ్చే ఫలితాల్లో పెద్ద తేడా కనిపిస్తుందని వారు సూచిస్తున్నారు.