Toothpaste | దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోజువారీగా ఉపయోగించే అనేక వస్తువులపై భయాలు, అపోహలు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. అలాంటి వాటిలో టూత్‌పేస్ట్ కూడా ఒకటి. టూత్‌పేస్ట్‌లో ఉండే కొన్ని రసాయనాలు క్యాన్సర్‌కు కారణమవుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టూత్‌పేస్ట్ క్యాన్సర్‌కు కారణమవుతుందనేది పూర్తిగా అపోహ మాత్రమేనని చెబుతున్నారు. ఈ అపోహకు కారణం ఒకేలా వినిపించే రెండు వేర్వేరు రసాయనాలను గందరగోళానికి గురి చేయడమేనని వివరిస్తున్నారు. చాలా టూత్‌పేస్ట్‌లలో సోడియం లారిల్ సల్ఫేట్ (Sodium Lauryl Sulphate – SLS) అనే పదార్థం ఉంటుంది. ఇది టూత్‌పేస్ట్‌లో నురుగు ఏర్పడటానికి, దంతాలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. అయితే కొందరు దీనిని సోడియం లారెత్ సల్ఫేట్ (Sodium Laureth Sulphate – SLES)తో పొరపాటు పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. SLES తయారీ ప్రక్రియలో ఏర్పడే కొన్ని ఉప ఉత్పత్తులు విషపూరిత ప్రభావాలకు సంబంధించిన చర్చల్లో ఉంటాయి. ఈ రెండు రసాయనాల పేర్లు ఒకేలా ఉండటంతోనే టూత్‌పేస్ట్ క్యాన్సర్‌కు కారణమనే అపోహ వ్యాపించిందని అంటున్నారు.
SLS వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే కొంతమందిలో ఇది నోటి లోపలి పొరను స్వల్పంగా చికాకు పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తరచూ నోటి పుండ్లు రావడం, నోటి లోపలి చర్మం అత్యంత సున్నితంగా ఉండటం లేదా దంతాలను తోమేటప్పుడు మంటగా అనిపించడం వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు ఎదురయ్యే వారు SLS లేని టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తే అసౌకర్యం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సున్నితత్వం లేని వారిలో SLS సాధారణంగా సురక్షితంగానే ఉంటుంది.
కొంతమంది SLS పరిశ్రమల్లో కూడా ఉపయోగించే రసాయనం కాబట్టి అది ప్రమాదకరమని భావిస్తుంటారు. అయితే ఒక పదార్థాన్ని పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారనే కారణంతోనే అది మన ఆరోగ్యానికి హానికరమని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం ప్రతిరోజూ ఉపయోగించే నీరు కూడా అనేక పరిశ్రమల్లో వినియోగిస్తారని, కాబట్టి ఒక పదార్థం పారిశ్రామిక వినియోగంలో ఉందనే ఒక్క కారణంతో దానిని విషపూరితమని భావించడం సరైన విధానం కాదని పేర్కొంటున్నారు. అలాగే ప్రతి టూత్‌పేస్ట్ అందరికీ ఒకేలా సరిపోదని నిపుణులు చెబుతున్నారు. దంతాలు, చిగుళ్ల సున్నితత్వం, నోటి ఆరోగ్య పరిస్థితులను బట్టి టూత్‌పేస్ట్‌ను ఎంపిక చేసుకోవడం మంచిదని, అవసరమైతే దంతవైద్యుడి సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.