Joint Pains | నేటి తరుణంలో కీళ్ల నొప్పులు సాధారణ ఆరోగ్య సమస్యగా మారాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ లేదా శరీర నిర్మాణ సంబంధిత సమస్యల కారణంగా చాలా మంది ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఇందులో ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ అనే రెండు వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే చాలా మంది ఈ రెండూ ఒకటేనని భావిస్తారు. కానీ వీటి కారణాలు, లక్షణాలు, చికిత్స విధానాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున తన ఆరోగ్యకరమైన కణాలపైనే దాడి చేయడం. ముఖ్యంగా కీళ్ల చుట్టూ ఉండే పొరపై ప్రభావం చూపి తీవ్రమైన వాపు, నొప్పి, కీళ్లు దెబ్బతినే పరిస్థితిని కలిగిస్తుంది. ఈ వ్యాధి కేవలం కీళ్లకే పరిమితం కాకుండా చర్మం, కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని దీర్ఘకాలికంగా నియంత్రించడం చాలా ముఖ్యం.
ఇక ఆస్టియోఆర్థరైటిస్ మాత్రం వయస్సు, అధిక వినియోగం లేదా కీళ్లపై ఒత్తిడి కారణంగా ఏర్పడే సమస్య. కీళ్ల మధ్య ఉండే కార్టిలేజ్ క్రమంగా దెబ్బతినడం వల్ల ఎముకలు ఒకదానికొకటి రుద్దుకోవడం మొదలవుతుంది. దీని వల్ల నొప్పి, గట్టిపడటం, కదలికల్లో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మోకాళ్లు, నడుము, వెన్నెముక వంటి బరువు మోసే కీళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రెండు వ్యాధుల లక్షణాల్లో కూడా స్పష్టమైన తేడాలు ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో ఉదయం లేవగానే గంటల పాటు కీళ్లు గట్టిపడటం కనిపిస్తుంది. శరీర అలసట, స్వల్ప జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా శరీరంలోని రెండు వైపులా ఒకే కీళ్లు ప్రభావితమవడం దీని ప్రత్యేక లక్షణం. ఆస్టియోఆర్థరైటిస్లో అయితే కదలికలు చేసినప్పుడు నొప్పి పెరగడం, విశ్రాంతి తీసుకుంటే కొంత ఉపశమనం కలగడం కనిపిస్తుంది. కొద్దిసేపు కూర్చున్న తర్వాత లేదా నిద్రలేచినప్పుడు తాత్కాలికంగా కీళ్లు గట్టిగా అనిపిస్తాయి. అలాగే కీళ్లు కదిలించినప్పుడు రాపిడి శబ్దం వినిపించడం కూడా ఈ సమస్యలో సాధారణం. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు జన్యుపరమైన కారణాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ధూమపానం వంటి అంశాలు కారణమవుతాయి. ఇక ఆస్టియోఆర్థరైటిస్కు వయస్సు, అధిక బరువు, పాత గాయాలు, ఒకే విధమైన శారీరక పనులు ఎక్కువకాలం చేయడం వంటి కారణాలు ప్రధానంగా ఉంటాయి.
వైద్యుల ప్రకారం, సరైన నిర్ధారణ చాలా ముఖ్యమని చెబుతున్నారు. ఆస్టియోఆర్థరైటిస్ను సాధారణంగా ఎక్స్‌రేలు, శారీరక పరీక్షల ద్వారా గుర్తిస్తారు. కీళ్ల మధ్య ఖాళీ తగ్గడం, ఎముక పెరుగుదల వంటి లక్షణాలు కనిపిస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిర్ధారణకు మాత్రం రక్తపరీక్షలు కూడా అవసరం అవుతాయి. రుమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీ-సీసీపీ యాంటీబాడీలు, ఈఎస్సార్, సీఆర్పీ వంటి ఇన్ఫ్లమేషన్ సూచికలను పరిశీలిస్తారు. చికిత్సలో కూడా రెండింటికీ వేర్వేరు విధానాలు ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో వ్యాధి వేగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక మందులు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలు, బయాలజికల్ థెరపీలు వాడతారు. ఆస్టియోఆర్థరైటిస్లో అయితే నొప్పి నియంత్రణ, ఫిజియోథెరపీ, బరువు తగ్గించడం, జీవనశైలిలో మార్పులు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
అధిక స్థాయిలో కీళ్లు దెబ్బతిన్నప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స అవసరం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రోబోటిక్ సాంకేతికతతో చేసే జాయింట్ రీప్లేస్మెంట్ చికిత్సలు మరింత కచ్చితత్వంతో, త్వరగా కోలుకునేలా సహాయపడుతున్నాయని పేర్కొంటున్నారు. కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బరువును నియంత్రణలో ఉంచడం, తక్కువ ఒత్తిడి కలిగించే వ్యాయామాలు చేయడం, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉండకుండా తరచూ కదలికలు చేయడం కూడా కీళ్ల గట్టిపడకుండా సహాయపడుతుంది. కొన్ని వారాలకు మించి కీళ్ల నొప్పులు కొనసాగితే, వాపు, వేడి లేదా కదలికల్లో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.