Urinary Tract Infection | మేడమ్ నమస్తే. మా బాబు మూత్రం పోస్తున్నప్పుడు వెక్కివెక్కి ఏడుస్తాడు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావచ్చని నా భయం. ఆ సమస్య లక్షణాలు ఏమిటి?
– ఓ పాఠకురాలు
పిల్లల వయసును బట్టి మూలకారణాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. నెలల పసికందులు మూత్రం పోసేముందు ఏడవటం సాధారణం. ఆ తర్వాత వాళ్లే ఊరుకుంటారు. మూత్రంతో పక్క తడిసిపోయి అసౌకర్యానికి గురి కావడం వల్ల కూడా ఏడుపు లంకించుకోవచ్చు. ఐదారేండ్ల పిల్లలు మూత్రం పోస్తున్నప్పుడు ఏడుస్తున్నారంటే మాత్రం.. మూత్ర నాళాల్లో సమస్య ఉందని అర్థం. అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు. కొన్నిసార్లు ‘ఫిమోసిస్’ వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. మూత్ర రంధ్రం వద్ద చర్మం బిగుతుగా మారడం వల్ల సమస్య ఎదురవుతుంది. ఇలాంటప్పుడు పిల్లల్ని బెదిరించో, బుజ్జగించో ఏడుపు మాన్పించే ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు. యూరినరీ ట్రాక్ సమస్య వల్ల కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. వెంటనే, వైద్యులను సంప్రదించండి.
– డాక్టర్ ఉషారాణి ,సూపరింటెండెంట్
నిలోఫర్ పిల్లల దవాఖాన, హైదరాబాద్