ఆ’గర్భ’ శత్రువు!.. థైరాయిడ్ లోపాలు తల్లీ బిడ్డలకు ప్రమాదమే
Thyroid | థైరాయిడ్ సమస్య.. నిండు గర్భిణి అయిన తల్లిని వేధిస్తుంది. పొట్టలోని బిడ్డనూ బాధపెడుతుంది. తొలి దశలోనే లక్షణాలను గుర్తిస్తే, తక్షణం చికిత్స ప్రారంభిస్తే ఆ రుగ్మతను జయించవచ్చు. తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడుకోవచ్చు. ఎందుకైనా మంచిది, గర్భధారణకు ముందే మహిళలు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిదని అంటున్నారు వై

థైరాయిడ్ సమస్య.. నిండు గర్భిణి అయిన తల్లిని వేధిస్తుంది. పొట్టలోని బిడ్డనూ బాధపెడుతుంది. తొలి దశలోనే లక్షణాలను గుర్తిస్తే, తక్షణం చికిత్స ప్రారంభిస్తే ఆ రుగ్మతను జయించవచ్చు. తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడుకోవచ్చు. ఎందుకైనా మంచిది, గర్భధారణకు ముందే మహిళలు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు.
థైరాయిడ్… మనిషి మెడ భాగంలో సీతాకోక చిలుక ఆకారంలోని ఓ ప్రధాన గ్రంథి. ఇది థైరాక్సిన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ శరీరంలోని జీవక్రియ రేటును నియంత్రిస్తుంది. థైరాక్సిన్ హార్మోన్ విడుదలలో హెచ్చుతగ్గులనే థైరాయిడ్ సమస్యగా పరిగణిస్తారు. భౌగోళిక పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, అయోడిన్ లోపం తదితరాలు థైరాయిడ్ హార్మోన్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయి. థైరాయిడ్ గ్రంథి మహిళ ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ముఖ్యంగా గర్భిణులలో థైరాక్సిన్ స్థాయులు సరిపడినంతగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా, ఆ ప్రభావం తల్లితోపాటు కడుపులోని బిడ్డపైనా పడుతుంది. ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహంలానే ఇదీ సర్వసాధారణం అయిపోయింది. సకాలంలో గుర్తించి, వెంటనే చికిత్స తీసుకుంటే ఈ ఇబ్బందిని నియంత్రించవచ్చు. తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడుకోవచ్చు.
రెండు రకాలు
థైరాయిడ్ సమస్య రెండు రకాలు. ఒకటి ‘హైపో థైరాయిడిజం’. రెండు ‘హైపర్ థైరాయిడిజం’. ఈ రెండిటిలో ఏది ఉన్నా అనారోగ్యకరమే. గర్భిణులకైతే మరింత ప్రమాదకరం. ఈ పరిస్థితి గర్భ విచ్ఛిత్తికి దారితీయవచ్చు. నెలలు నిండకుండానే ప్రసవం జరుగవచ్చు. బిడ్డ తక్కువ బరువుతో జన్మించవచ్చు. మిగతా నవజాత శిశువులతో పోలిస్తే, బరువు తక్కువ బిడ్డలలో మరణాల రేటు ఎక్కువ. గర్భ విచ్ఛిత్తి తల్లి ప్రాణాలకూ గండమే.
హైపో థైరాయిడిజం అంటే..
..థైరాయిడ్ గ్రంథి నుంచి తక్కువ మోతాదులో థైరాక్సిన్ హార్మోను విడుదల కావడం. దీన్నే ‘థైరాయిడ్ డెఫీషియెన్సీ’ అంటారు. హైపో థైరాయిడిజం వల్ల శరీరానికి తగిన మోతాదులో థైరాయిడ్ హార్మోన్ లభించదు. గర్భిణులలో హైపర్ థైరాయిడిజంకంటే, హైపో థైరాయిడిజం సమస్యలే అధికం. సాధారణ మహిళలతో పోల్చినప్పుడు గర్భిణులు 10 నుంచి 15 రెట్లు ఈ రుగ్మతకు గురవుతారని అంచనా. సాధారణంగా, గర్భం దాల్చినప్పుడు హార్మోన్లలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ ప్రభావంతో కొంతమందిలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పడిపోతుంది. సరిగ్గా అదే సమయానికి, గర్భంలోని పిండానికి థైరాయిడ్ హార్మోన్ అవసరం ఏర్పడుతుంది. దీనివల్ల, బిడ్డను మోస్తున్న తల్లికి కూడా థైరాయిడ్ హార్మోన్ అవసరం పెరుగుతుంది. కానీ, ఆమెలో ఆ మేరకు ఉత్పత్తి జరుగదు. ఇక్కడే సమస్య మొదలవుతుంది.
ఆ మూడు నెలలూ కీలకమే
గర్భం దాల్చిన మూడు నెలల్లోనే పిండంలో థైరాయిడ్ గ్రంథి ఏర్పాటు మొదలవుతుంది. ఆ ప్రక్రియకు కావలసిన థైరాయిడ్ హార్మోన్ తల్లి నుంచే సరఫరా అవుతుంది. 18 నుంచి 20 వారాల వరకు గర్భస్థ శిశువు తల్లి నుంచిసరఫరా అయ్యే థైరాయిడ్ హార్మోన్‌పైనే పూర్తిగా ఆధారపడుతుంది. ఆ సమయంలో తల్లిలో సరిపడా హార్మోన్ ఉండాలి. లేకపోతే, బిడ్డపై తీవ్ర ప్రభావం పడుతుంది. అబార్షన్ జరిగినా జరుగవచ్చు. బిడ్డలో మెదడు, నాడీ వ్యవస్థ, ఇతర అవయవాలు రూపు దిద్దుకోవడంలోనూ థైరాయిడ్ హార్మోన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ అందకపోతే శారీరక, మానసిక వైకల్యాలతో పుట్టవచ్చు.
శిశువులకు గండాలు
- తక్కువ బరువుతో జన్మించడం.
- మెదడు, నాడీ వ్యవస్థ సరిగ్గా ఎదగకపోవడం.
- మానసిక రుగ్మతలు.
- ఆకలి మందగించడం.
- ఎదుగుదల లోపం.
- చురుకుదనం తక్కువ.
- పొడిబారిన జుట్టు.
హైపర్ థైరాయిడిజం
థైరాయిడ్ హార్మోన్ స్థాయులు ఉండాల్సినదానికంటే అధికంగా ఉంటే, దాన్ని హైపర్ థైరాయిడిజంగా పరిగణిస్తారు. హైపో థైరాయిడిజంతో పోలిస్తే, హైపర్ థైరాయిడ్ సమస్య గర్భిణుల్లో కొంత తక్కువే. ఇది కూడా తల్లితో పాటు, పొట్టలోని బిడ్డపైనా ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ పరీక్షలో టీఎస్‌హెచ్ స్థాయులు పడిపోతే, వారికి హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నట్టు లెక్క. అంటే, విడుదల కావాల్సిన స్థాయి కంటే, ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ విడుదల అవుతూ ఉంటుంది.
ప్రతి మూడు నెలలకూ పరీక్షలు
గర్భధారణ ప్రక్రియను మూడు నెలల చొప్పున, మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటి ట్రైమిస్టర్, రెండవ ట్రైమిస్టర్, మూడవ ట్రైమిస్టర్.. అంటూ వ్యవహరిస్తారు. గర్భం దాల్చిన తొలి మూడు నెలలను మొదటి ట్రైమిస్టర్‌గా, తరువాత మూడు నెలల కాలాన్ని, అంటే 4,5,6 నెలలను రెండవ ట్రైమిస్టర్‌గా, 7,8,9 నెలలను మూడవ ట్రైమిస్టర్‌గా పరిగణిస్తారు. మూడు ట్రైమిస్టర్లలో గర్భిణి తప్పనిసరిగా రక్త పరీక్షలతో పాటు థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. థైరాయిడ్ స్థాయి మొదటి ట్రైమిస్టర్లో 0.2 నుంచి 2.5 మధ్య; రెండవ, మూడవ ట్రైమిస్టర్లో 0.3 నుంచి 3 మధ్య ఉండాలి. హెచ్చుతగ్గులుంటే వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తారు. హైపో థైరాయిడ్ సమస్య ఉంటే.. హార్మోన్ సప్లిమెంట్స్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్, అయోడిన్ సిఫారసు చేస్తారు. వీటితోపాటు పోషకాహారమూ తీసుకోవాలి. హైపర్ థైరాయిడ్ రోగులకు హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించే సప్రెషన్స్ ఇస్తారు. తీవ్ర స్థాయిని దాటిపోతే, మూల కారణం తెలుసుకుని సర్జరీ చేయాల్సి వస్తుంది. కాబట్టి, గర్భం దాల్చడానికి ముందే, అంటే ప్రీ-ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్ని విధాల ఉత్తమం. గర్భం దాల్చేందుకు శరీరం సిద్ధంగా ఉందా లేదా అన్నదీ ఈ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. అదే సమయంలో, థైరాయిడ్ సమస్యను కూడా గుర్తిస్తారు. ఒకవేళ రోగ నిర్ధారణ జరిగితే, తగిన చికిత్స అందిస్తారు. గర్భధారణ సమయంలో సమస్యలు తలెత్తకుండా చూస్తారు. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేలా తమవంతు సహకారం అందిస్తారు వైద్య నిపుణులు.
సాధారణ మహిళల్లో..
- బరువు తగ్గిపోవడం.
- నెలసరి సమస్య.
- డయేరియా.
- నిద్రలేమి.
- కాళ్లు, చేతుల్లో వణుకు.
- జుట్టు రాలిపోవడం.
- వేడిని తట్టుకోలేకపోవడం.
- విపరీతంగా చెమటలు.
శిశువుపై…
- తక్కువ బరువుతో జన్మిస్తారు.
- గర్భంలోనే మరణం.
- గుండె వ్యాధులు.
- తరచూ వాంతులు, విరేచనాలు.
- మెడపై వాపుతోనే పుడతారు.
- కనుగుడ్లు బయటికి పొడుచుకొని వచ్చినట్లు ఉంటాయి.
ప్రభావాలు తీవ్రంగానే
- అబార్షన్లు.
- గర్భం దాల్చిన తర్వాత కూడా బరువు పెరగరు.
- గుండె దడ.
- తొమ్మిది నెలలు నిండకుండానే ప్రసవం.
- థైరాయిడ్ స్టోమ్ (అత్యధిక స్థాయిలో థైరాయిడ్ హార్మోన్ విడుదల కావడం).
- అధిక రక్తపోటు.
- వేడిని తట్టుకోలేని పరిస్థితి.
- తీవ్రమైన మానసిక ఆందోళనలు.
- చర్మానికి దద్దుర్లు.
సాధారణ మహిళల్లో..
- ఊబకాయం.
- పీసీవోడీ.
- నెలసరి సమస్యలు.
- నెలసరిలో తీవ్ర రక్తస్రావం.
- సంతాన లేమి.
- చల్లదనాన్ని తట్టుకోలేకపోవడం.
- హృదయ స్పందన నెమ్మదించడం.
- జుట్టు రాలిపోవడం.
- చర్మం పొడిబారడం, గోళ్లు చితికిపోవడం.
- దాంపత్య జీవితంపై అనాసక్తి.
- బాలికలైతే రజస్వల కావడంలో ఆలస్యం లేదంటే అసలు కాకపోవడం.
అనర్థాలు అనేకం
- అబార్షన్ (గర్భ విచ్ఛిత్తి)నెలలు నిండకుండానే ప్రసవించడం.
- నీరసించిపోవడం, బలహీనపడిపోవడం.
- సిజేరియన్ చేయాల్సి వస్తే, అనస్థీషియా ఇవ్వడంలో ఇబ్బందులు. మానసిక ఒత్తిడికి గురికావడం.
- గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపడం.
కారణాలు ఎన్నో..
- రోగ నిరోధక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ఆటో ఇమ్యూన్ వ్యాధులు.
- ఏదైనా చికిత్స కోసం మెడ భాగంలో రేడియేషన్ ఇవ్వడం.
- థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలు.
- సర్జరీలో భాగంగా థైరాయిడ్ గ్రంథిని తొలగించడం.
- వంశ పారంపర్యం.
- అయోడిన్ లోపం.
- ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం.
- హృద్రోగం, మానసిక సమస్యలు, క్యాన్సర్ తదితర వ్యాధులకు వాడే ఔషధాల చెడు ప్రభావం.

డాక్టర్ వసుంధర చీపురుపల్లి
గైనకాలజిస్టు, రోబోటిక్ అండ్ ల్యాపరోస్కోపిక్ సర్జన్
కిమ్స్ హాస్పిటల్,
సికింద్రాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Pintop1
- Pregnant Woman
- thyroid
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

