Thyroid | థైరాయిడ్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని చెప్పవచ్చు. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. మందులు వాడుతున్నప్పటికీ థైరాయిడ్ తో బాధపడే వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిందే. వాటిల్లో అధిక బరువును తగ్గించుకోవడం కూడా ఒక్కటి. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి బరువు తగ్గడం అంత సులభమైన విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా తక్కువ తినండి, ఎక్కువ కదలండి అనే ఫార్ములా అందరికీ పనిచేస్తుందని భావిస్తారు. కానీ హైపోథైరాయిడిజం ఉన్నవారిలో ఈ విధానం కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు ఇస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారం తీవ్రంగా తగ్గిస్తే, శరీరం దానిని ఒత్తిడిగా భావిస్తుంది. అప్పుడు శరీరం ఫ్యాట్‌ను కరిగించడం తగ్గించి సర్వైవల్ మోడ్ లోకి వెళుతుంది.
ఈ పరిస్థితిలో శరీరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ల పనితీరు మందగిస్తుంది. టి4 హార్మోన్ నుంచి టి3 హార్మోన్ గా మారే ప్రక్రియ తగ్గిపోతుంది. అదే సమయంలో రివర్స్ టి3 అనే రూపం పెరిగి, ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియను అడ్డుకుంటుంది. ఫలితంగా మెటబాలిజం తగ్గిపోవడం, అలసట పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీంతో, తక్కువ తిన్నప్పటికీ బరువు తగ్గకపోవడం, మరింత నిరుత్సాహం కలగడం జరుగుతుంది. ఇది క్రమశిక్షణ లోపం కాదు, శరీర సంకేతాల సమస్య అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే, శరీరం బరువు తగ్గడాన్ని అడ్డుకోవడం కాదు, అది తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యకు పరిష్కారం ఆహారం తగ్గించడం కాదు, సరైన పోషకాహారం తీసుకోవడమని కూడా వారు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రోటీన్ సరిపడా తీసుకోవడం ద్వారా మెటబాలిజం మెరుగుపడుతుంది. అలాగే మైక్రోన్యూట్రియెంట్స్ (విటమిన్లు, ఖనిజాలు) హార్మోన్ల పనితీరుకు సహాయపడతాయి. ఇక ఒత్తిడిని నియంత్రించడం కూడా చాలా కీలకం. నిరంతరం ఒత్తిడిలో ఉంటే శరీరం సర్వైవల్ మోడ్ లోనే కొనసాగుతుంది. అందుకే సరైన ఆహారం, విశ్రాంతి, మానసిక సమతుల్యత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా థైరాయిడ్ సమస్య ఉన్నవారు త్వరగా ఫలితాలు ఇవ్వగల క్రాష్ డైట్స్కి దూరంగా ఉండాలి. శరీరాన్ని పోషించడం ద్వారా మాత్రమే దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. థైరాయిడ్‌కు ఆకలి కాదు, పోషణ అవసరమని నిపుణులు చెబుతున్నారు.