Heart Diseases | ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారంలో, జీవనశైలిలో వచ్చిన మార్పులే గుండె జబ్బులకు ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. అయితే చిన్న చిన్న జీవనశైలి మార్పులు కూడా గుండె ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపగలవని తాజా పరిశోధన వెల్లడించింది. రోజుకు కేవలం 11 నిమిషాలు ఎక్కువగా నిద్రపోవడం, కొన్ని నిమిషాలు అదనంగా నడవడం, కొద్దిగా ఎక్కువ కూరగాయలు తినడం ద్వారా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని సుమారు 10 శాతం వరకు తగ్గించవచ్చని అధ్యయనం సూచిస్తోంది. ఈ పరిశోధనలో 53వేల మందికి పైగా వ్యక్తులను ఎనిమిదేళ్ల పాటు పరిశీలించారు. వారి నిద్ర అలవాట్లు, వ్యాయామం, ఆహారపు అలవాట్లను విశ్లేషించి, చిన్న మార్పులు కూడా ఆరోగ్యానికి ఉపయోగకరమని తేల్చారు.
ముఖ్యంగా రోజుకు 11 నిమిషాలు అదనంగా నిద్రపోవడం, సుమారు 4.5 నిమిషాలు మోస్తరు నుంచి తీవ్ర స్థాయి శారీరక వ్యాయామం చేయడం, రోజువారీ ఆహారంలో ఒక కప్పు నాలుగో వంతు అదనంగా కూరగాయలు చేర్చడం ద్వారా గుండె సంబంధిత సమస్యల ప్రమాదం గణనీయంగా తగ్గిందని గుర్తించారు. ఈ మూడు మార్పులను కలిపి పాటించినప్పుడు గుండెపోటు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రధాన గుండె వ్యాధుల ప్రమాదం 10 శాతం వరకు తగ్గింది. అయితే మరింత పెద్ద స్థాయిలో జీవనశైలి మార్పులు చేసిన వారిలో ప్రయోజనం ఇంకా ఎక్కువగా కనిపించింది. రోజుకు 8 నుంచి 9 గంటల నిద్ర, కనీసం 42 నిమిషాల శారీరక వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకున్నవారిలో గుండె వ్యాధుల ప్రమాదం 57 శాతం వరకు తగ్గినట్లు వెల్లడైంది. ఈ పరిశోధనలో స్మార్ట్‌వాచ్‌ల వంటి వేరబుల్ పరికరాల ద్వారా నిద్ర, వ్యాయామ డేటాను సేకరించారు. ఆహారపు అలవాట్లను పాల్గొన్నవారు స్వయంగా వివరించారు. మొత్తం పరిశీలన కాలంలో 2,034 గుండె సంబంధిత ప్రధాన సంఘటనలు నమోదయ్యాయి.
పరిశోధకులు చెబుతున్నదేమిటంటే, ఒక్కసారిగా పెద్ద మార్పులు చేయడం కంటే, రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం చాలా సులభం, అలాగే దీర్ఘకాలం కొనసాగించగలిగినవి. ఈ చిన్న అలవాట్లు కలిసొచ్చినప్పుడు గుండె ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీవనశైలిని ఒక్కసారిగా పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. నిద్ర, వ్యాయామం, ఆహారం వంటి అంశాల్లో చిన్న మార్పులు చేయడం ద్వారా కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం కోసం పెద్ద ప్రయత్నాలు అవసరం ఉండవు. రోజువారీ అలవాట్లలో చిన్న మెరుగుదలలు కూడా దీర్ఘకాలంలో గుండెను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.