Dinner | రాత్రి పూట త్వరగా భోజనం చేస్తే శరీరంలో నిజంగా ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది ఇది కేవలం ఆకలి తగ్గడానికే సహాయపడుతుందని భావిస్తారు. కానీ శరీరంలో జరిగే మార్పులు అంతకంటే చాలా పెద్దవిగా ఉంటాయి. నిద్రకు ముందు పొట్టకు సరైన విశ్రాంతి ఇచ్చినప్పుడు, శరీరం జీర్ణక్రియపై కాకుండా రిపేర్ (పునరుద్ధరణ) పనులపై దృష్టి పెడుతుంది. దీని వల్ల గట్ (జీర్ణ వ్యవస్థ) రిథమ్ నుంచి నిద్ర ప్యాటర్న్స్ వరకు అనేక మార్పులు జరుగుతాయి. రాత్రిపూట త్వరగా తినడం వల్ల శరీరంలో జరిగే మార్పుల గురించి వైద్యులు వివరిస్తున్నారు. మొదటగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా పని చేస్తూనే ఉంటుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, ఆమ్లత్వం (ఆసిడిటీ) పెరుగుతుంది.
అయితే త్వరగాఆ భోజనం చేస్తే గట్ ఒక నియమిత రిథమ్కి అలవాటు పడుతుంది. దీంతో ఉబ్బరం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అలాగే నిద్ర నాణ్యత సహజంగా మెరుగవుతుంది. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం యాక్టివ్గా పనిచేయాల్సి వస్తుంది. హార్ట్ రేట్, శరీర ఉష్ణోగ్రత పెరుగుతాయి. దీంతో నిద్రపోవడం కష్టమవుతుంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్ ప్రకారం, నిద్రకు ముందు భోజనానికి కనీసం 2-3 గంటలు వ్యవధి ఉండాలి. దీని వల్ల రాత్రి మధ్యలో లేవడం తగ్గుతుంది. మూడు నెలల్లో ఇది సహజ నిద్ర చక్రాన్ని బలోపేతం చేస్తుంది.అదే విధంగా ఆకలి హార్మోన్లు సమతుల్యం అవుతాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల గ్రెలిన్, లెప్టిన్ అనే ఆకలి నియంత్రణ హార్మోన్లు అసమతుల్యం అవుతాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం ప్రకారం, రాత్రి ఆలస్యంగా తినడం వల్ల మరుసటి రోజు ఎక్కువ ఆకలి వేస్తుంది. అయితే రాత్రిపూట త్వరగా తింటే హార్మోన్లు మళ్లీ సహజ స్థితికి వస్తాయి, అనవసరంగా తినాలనిపించడం తగ్గుతుంది. అంతేకాకుండా బరువు, మెటబాలిజం మెరుగవుతాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అదనపు కాలరీలు శరీరంలో చేరుతాయి.
రాత్రి పూట త్వరగా భోజనం చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయి, శరీరం నిల్వ ఉన్న ఎనర్జీని సరిగ్గా వినియోగించుకోవడం మొదలుపెడుతుంది. కొందరికి ప్రత్యేకంగా డైట్ చేయకపోయినా క్రమంగా బరువు తగ్గడం కనిపిస్తుంది. అలాగే గట్ మైక్రోబయోమ్ (మంచి బ్యాక్టీరియా) మెరుగవుతుంది. రాత్రి ఆలస్యంగా తింటే గట్లోని మంచి బ్యాక్టీరియా సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. రాత్రి విరామం ఇవ్వడం వల్ల ఈ బ్యాక్టీరియా పునరుద్ధరణకు సమయం దొరుకుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగవడం, ఇన్ఫ్లమేషన్ (వాపు) తగ్గడం, ఇమ్యూనిటీ బలపడడం జరుగుతుంది. మల విసర్జన క్రమబద్ధంగా మారుతుంది. వీటితో పాటు ఆసిడ్ రిఫ్లక్స్ తగ్గుతుంది. రాత్రి తిన్న వెంటనే పడుకోవడం వల్ల గుండెల్లో మంట (ఆసిడ్ రిఫ్లక్స్) ఎక్కువగా ఉంటుంది. అయితే త్వరగా భోజనం చేస్తే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తగ్గి ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. అయితే రాత్రి భోజనం త్వరగా చేయడం వల్ల లాభాలు చాలా త్వరగా ప్రారంభమై క్రమంగా పెరుగుతాయి. చిన్న అలవాటు మార్పు కూడా శరీర ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపగలదని నిపుణులు తెలియజేస్తున్నారు.