GLP-1 Medicine | GLP-1 ఔషధాలు, అంటే గ్లుకాగాన్లాంటి పెప్టైడ్-1 రిసెప్టర్ అగోనిస్టులు, శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే GLP-1 హార్మోన్ చర్యను అనుకరిస్తూ పనిచేసే ఔషధాల వర్గం. ఈ హార్మోన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రణలో, అలాగే ఆకలి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. మొదటగా ఇవి Type 2 Diabetes చికిత్స కోసం అభివృద్ధి చేయబడినప్పటికీ, ప్రస్తుతం బరువు తగ్గించే మందులుగా విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. ఆకలిని తగ్గించడం, జీర్ణక్రియను నెమ్మదించడం, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడం ద్వారా ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. అంతేకాదు, గుండె సంబంధిత ఆరోగ్యంపై కూడా ఇవి రక్షణాత్మక ప్రయోజనాలు కలిగిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, తాజాగా BMJ Medicine జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఈ ఔషధాలను మధ్యలో ఆపేస్తే గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుందని వెల్లడించింది. ముఖ్యంగా Type 2 Diabetes ఉన్న వ్యక్తులు ఈ మందులను ఆపినప్పుడు గుండెపోటు, స్ట్రోక్, గుండెజబ్బుల వల్ల మరణం వంటి ప్రధాన సమస్యల ప్రమాదం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ అధ్యయనం ప్రకారం, GLP-1 మందులను నిరంతరం తీసుకున్న రోగుల్లో గుండె సంబంధిత ప్రధాన ఘటనలు, మరణాల ప్రమాదం సుమారు 18 శాతం వరకు తగ్గినట్లు తేలింది. పాత తరహా డయాబెటిస్ మందులతో పోలిస్తే ఇది గణనీయమైన రక్షణను అందిస్తుంది. అయితే ఈ మందులను ఆపేసిన వారిలో గుండె సంబంధిత సమస్యల ప్రమాదం స్పష్టంగా పెరిగింది. ఈ అధ్యయనం రీబౌండ్ ఎఫెక్ట్ అనే పరిణామాన్ని కూడా ప్రస్తావించింది. అంటే మందులు ఆపిన వెంటనే గుండెకు లభిస్తున్న రక్షణ తగ్గడం ప్రారంభమవుతుంది. మందులు ఆపిన 6 నెలల్లో ప్రమాదం 4 శాతం పెరుగుతుండగా, ఒక సంవత్సరం తరువాత ఇది 14 శాతానికి, రెండు సంవత్సరాల తరువాత 22 శాతానికి పెరుగుతుంది. ఈ స్థాయికి చేరుకునే సరికి, మందులు తీసుకున్నప్పుడు పొందిన ప్రయోజనాలు దాదాపు పూర్తిగా తగ్గిపోతాయి. మందులు ఆపిన తర్వాత మళ్లీ బరువు పెరగడం, శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు) పెరగడం వంటి అంశాలు ఈ పరిస్థితికి కారణమని అధ్యయనం సూచిస్తోంది. అంతేకాదు, పూర్తిగా ఆపకపోయినా మధ్యలో విరామం తీసుకోవడం కూడా ప్రమాదకరమని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది. కనీసం 90 రోజుల పాటు మందులు ఆపి మళ్లీ ప్రారంభించినవారిలో కూడా గుండె సంబంధిత ప్రమాదం పెరిగినట్లు గుర్తించారు. అంటే ఈ ఔషధాల వినియోగంలో నిరంతరత్వం చాలా కీలకమని స్పష్టం అవుతోంది.
ఇక ఈ మందులను ఆపడం సాధారణంగా జరుగుతున్న విషయమని అధ్యయనం చెబుతోంది. సుమారు 26 శాతం మంది మూడు సంవత్సరాల లోపే చికిత్సను నిలిపివేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మొదటి ఏడాదిలోనే మందులు ఆపేస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు వాంతులు, పొట్టలో అసౌకర్యం వంటి దుష్ప్రభావాలు, అలాగే మందుల అధిక ధర, అందుబాటు లోపం వంటి అంశాలుగా గుర్తించారు. ఈ అధ్యయనం తేల్చిందేమిటంటే, Type 2 Diabetes ఉన్నవారికి GLP-1 మందులు దీర్ఘకాలికంగా లేదా జీవితాంతం అవసరమయ్యే చికిత్సగా భావించాల్సి ఉంటుంది. ఈ మందులను ఆపడం వల్ల గుండెకు లభించే రక్షణ తగ్గిపోవడంతోపాటు ఆరోగ్య ప్రమాదాలు మళ్లీ వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, GLP-1 మందులు వాడుతున్న వారు ఎప్పుడూ వైద్యుల సలహా లేకుండా మందుల వినియోగంలో మార్పులు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.