Junk Food | జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మందికి తెలుసు. అయితే దాన్ని పూర్తిగా 60 రోజుల పాటు మానేస్తే శరీరంలో కనిపించని లోతైన మార్పులు జరుగుతాయి. ప్రాసెస్ చేసిన స్నాక్స్, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్‌ను ఆపేసినప్పుడు శరీరం దెబ్బతిన్న వ్యవస్థలను మళ్లీ సరిచేసుకోవడం ప్రారంభిస్తుంది. తాజా పరిశోధనలు తెలిపిన ప్రకారం కొద్ది రోజులపాటు జంక్ ఫుడ్‌కు విరామం వల్ల ఆకలి నియంత్రణ, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం, మెటబాలిజం మెరుగుపడటానికి దోహదం చేస్తుందని వెల్లడైంది. మొదట కొన్ని వారాలు శుద్ధి దశలా ఉండగా, తర్వాత శక్తి స్థిరంగా మారుతుంది. 60 రోజుల పాటు జంక్ ఫుడ్ మానేస్తే శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో వైద్యులు వివరిస్తున్నారు.
60 రోజుల పాటు జంక్ ఫుడ్ మానేయడం వల్ల ఆకలి హార్మోన్లు సమతుల్యం అవుతాయి. జంక్ ఫుడ్ వల్ల ఆకలి నియంత్రణ దెబ్బతింటుంది. దీనివల్ల ఎక్కువగా తినే అలవాటు ఏర్పడుతుంది. అయితే 60 రోజుల పాటు దాన్ని మానేస్తే లెప్టిన్, ఘ్రెలిన్ వంటి ఆకలి హార్మోన్లు సరిగా పనిచేయడం ప్రారంభిస్తాయి. దాంతో తృప్తి భావం సరిగ్గా తెలుస్తుంది. అలాగే కాలరీలు సహజంగా తగ్గుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గిస్తే రోజువారీ క్యాలరీలు కూడా ఆటోమేటిక్‌గా తగ్గుతాయి. దాంతో బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండడం, శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. జంక్‌ఫుడ్ మానేయడం వల్ల గట్ (జీర్ణ వ్యవస్థ) ఆరోగ్యం మెరుగుపడుతుంది. జంక్ ఫుడ్ గట్‌లో బ్యాక్టీరియా సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. దాన్ని మానేస్తే గట్ లైనింగ్ మళ్లీ బలపడుతుంది, మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సులభంగా మారుతుంది. అంతేకాకుండా శరీర మెటబాలిజం మెరుగవుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించడం వల్ల మెటబాలిజం సరిగా పనిచేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీని వల్ల శరీరానికి అవసరమైన శక్తి సమర్థంగా ఉత్పత్తి అవుతుంది.
ఇక జంక్ ఫుడ్ మానేయడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది. జంక్ ఫుడ్ మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది మెమొరీ, ఆకలి నియంత్రణపై ప్రభావం చూపుతుంది. 60 రోజుల తర్వాత మెదడు మళ్లీ సరిగా స్పందించడం ప్రారంభించి, ఫోకస్ పెరుగుతుంది, అనవసరమైనవి తినాలనే కోరికలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు) తగ్గుతుంది. జంక్ ఫుడ్ వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులు, ఇతర సమస్యలకు దారి తీస్తుంది. రెండు నెలలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గి, చర్మం మెరుగుపడటం, ఉబ్బరం తగ్గడం, కీళ్ల నొప్పులు తగ్గడం వంటి ప్రయోజనాలు కనిపిస్తాయి. 60 రోజులు జంక్ ఫుడ్ మానేయడం కొంచెం కష్టంగా అనిపించినా, శరీరం చాలా త్వరగా ధన్యవాదాలు చెబుతుందని, బయట కనిపించే మార్పుల కంటే లోపల జరిగే మార్పులే ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనవని నిపుణులు తెలియజేస్తున్నారు.