శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరం. చిన్నపిల్లలకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ, పెద్దలకు ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. లేకుంటే వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయం తెలిసిందే. అయితే, సరైన నిద్ర లేకుంటే స్వార్థపరులైపోతారట. అవును మీరు చదివింది నిజమే. ఇది ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
నిద్రలేమి అనేది ఎలాంటి నష్టం చేస్తుందో తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీకి చెందిన పరిశోధకులు మూడు వేర్వేరు అధ్యయనాలు నిర్వహించారు. ఒక గంటసేపు తక్కువ నిద్రపోయినా అది ఇతరులకు సహాయం చేసే ప్రవర్తనపై ప్రభావితం చేస్తుందని తేలింది. నిద్ర పరిమాణం, నాణ్యత రెండూ వ్యక్తి భావోద్వేగ, సామాజిక ప్రవర్తనను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. దీంతోపాటు నిద్రలేమి అనేది డిప్రెషన్, యాంగ్జైటీ, మానసిక ఆరోగ్య రుగ్మతలు, ఊబకాయంలాంటి శారీరక రుగ్మతలకు కూడా కారణమవుతుందని కనుగొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు పీఎల్ఓఎస్ బయాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి.