మోకాలికి.. మేకో-రోబోటిక్ సర్జరీ

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స.. ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట. కారణం ప్రతి వంద మందిలో 60 మంది ఆర్థరైటిస్ (మోకాళ్ల నొప్పి)తో బాధపడుతున్నారు. పాతికేండ్ల క్రితం 60-70 పైబడిన వారిలో మాత్రమే మోకాళ్ల నొప్పులు ఉండేవి. కానీ ఇప్పుడు నలభైలలోనే మొదలవుతున్నాయి. నిజానికి ఇది వయసుతో వచ్చే సమస్య. వయసు పెరిగే కొద్దీ తీవ్రం అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల, చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పి వస్తున్నది. ఈ రుగ్మత ఉన్నవారికి సాధారణ శస్త్రచికిత్సతో పోలిస్తే అత్యాధునికమైన ‘మేకో-4వ జెనరేషన్’ రోబోటిక్ సర్జరీ శీఘ్ర ఉపశమనాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కీళ్లు అరిగిపోతాయి. మోకాళ్లలోని రెండు ఎముకల మధ్య ‘కార్టి లేజ్’ అనే పదార్థం ఉంటుంది. రెండు ఎముకలూ ఒకదానినొకటి రాసుకోకుండా ఇది రబ్బరు వాషర్లా పనిచేస్తుంది. కార్టిలేజ్ అనేది గ్రీజులాంటి సుతిమెత్తని పదార్థం. రెండు ఎముకలూ సులభంగా వంగేలా సహకరిస్తుంది. దీనివల్లే మనిషి అనాయాసంగా నడవగలుగుతాడు, సులభంగా కూర్చోగలుగుతాడు. అయితే, కొందరిలో చిన్న వయసులోనే కార్టిలేజ్ క్రమంగా గరుకుగా మారుతుంది. ఈ మార్పును సరైన సమయంలో గుర్తించకపోతే పూర్తిగా అరిగిపోతుంది కూడా. దీంతో మోకాలిలోని రెండు ఎముకలూ రాపిడికి గురవుతాయి. దీనివల్ల మోకాళ్ల మధ్యలోని ఎముకలు అరిగిపోయి నొప్పి వస్తుంది. నిజానికి, మోకాళ్ల అరుగు దలలో నాలుగు దశలు ఉంటాయి. కారణాలు అనేకం
- వయసు ప్రభావం.
- వంశ పారంపర్యం.
- అధిక బరువు.
- ఊబకాయం.
- కీళ్లపై తీవ్రమైన ఒత్తిడి.
- లక్షణాలు
- నడుస్తున్నప్పుడు మోకాళ్లలో నొప్పి.
- మెట్లు ఎక్కలేకపోవడం, దిగలేకపోవడం.
- కింద కూర్చోలేకపోవడం.
- ఎక్కువ సేపు నడవలేకపోవడం.
- నిలబడలేకపోవడం.
- మోకాళ్లపై వాపు రావడం.
- కాళ్లు వంకరగా మారడం.
నిర్ధారణ పద్ధతులు
ఎక్స్‌రేతో ఆర్థరైటిస్‌ను గుర్తించవచ్చు. ఎముకల అరుగుదల కూడా ఎక్స్‌రే ద్వారా తెలుసుకోవచ్చు.
చికిత్సా విధానాలు
ఈ చికిత్సలో రెండు పద్ధతులున్నాయి. ఒకటి, సాధారణ చికిత్స. రెండోది, మోకాలి మార్పిడి (నీ రీప్లేస్మెంట్) సర్జరీ
- సాధారణ చికిత్స
ఆర్థరైటిస్ ప్రారంభంలో ఉన్నప్పుడు, అంటే 1,2,3వ దశలో ఉంటే సాధారణ చికిత్సనే అందిస్తారు. వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, చికిత్స తీసుకుంటే కనుక మోకాళ్ల అరుగుదలను అరికట్టవచ్చు. పరిస్థితి మోకాళ్ల మార్పిడి వరకు రాకపోవచ్చు. సమస్య మొదటి మూడు దశల్లో ఉంటే ప్రాథమిక వైద్యం, పోషకాహారం సరిపోతుంది.
ఫిజియోథెరపీ: వైద్యుల సూచన మేరకు నిత్యం కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
వైద్యం: పెయిన్ కిల్లర్స్ మినహా అవసరమైన మందులన్నీ ఇస్తారు.
కొన్ని జాగ్రత్తలు: ముఖ్యంగా పద్మాసనంలో కూర్చోకూడదు. సాధ్యమైనంత వరకు కింద కూర్చోకూడదు. ఇండియన్ టాయిలెట్‌ను వాడరాదు. మెట్లు ఎక్కడం మానేయాలి.
ప్రత్యేక చికిత్స
సమస్య ప్రారంభ దశలో ఉన్నవారికి ప్రత్యేక చికిత్సను కూడా అందించవచ్చు. ఇందులో భాగంగా కొన్ని సందర్భాలలో ఇంట్రా ఆర్టిక్యులర్ ఇంజెక్షన్లు ఇస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (ఆర్ఎఫ్ఎ) ద్వారా నొప్పిని కలిగించే నరాలను బ్లాక్ చేస్తారు. రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా నిపుణులు తగిన వైద్య విధానాన్ని ఎంచుకుంటారు.
- మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
మోకాలిలోని రెండు ఎముకల చివరి భాగాలను కొంతవరకు కత్తిరించి ఆ ప్రాంతంలో లోహ పరికరాన్ని జోడించడాన్ని ‘మోకాలి మార్పిడి’ (నీ రీప్లేస్మెంట్) అంటారు. ఈ చికిత్స ద్వారా రోగికి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా నడవగలుగుతారు. అయితే ఆర్థరైటిస్ సమస్య నాలుగో దశకు చేరుకుంటేనే ఈ శస్త్ర చికిత్స చేస్తారు. ఈ సర్జరీ రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి పాక్షికం, మరొకటి పరిపూర్ణం. మోకాలిలోని ఒక వైపు (లోపలి వైపు)మాత్రమే ఇంప్లాంట్ అమర్చడాన్ని ‘పాక్షిక మోకాలి మార్పిడి’ అంటారు. మొత్తంగా మోకాలికి ఇంప్లాంట్ వేస్తే ‘పూర్తి మోకాలి మార్పిడి’ అంటారు. ఈ పద్ధతిలో అత్యాధునికమైన రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది.
ఇది సాధారణ శస్త్ర చికిత్సల కంటే సురక్షితమైంది. ఇందులో ‘మేకో-4వ జెనరేషన్’ రోబోటిక్ అనేది ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. దీనివల్ల రోగికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
- సాధారణ శస్త్రచికిత్స
- సాధారణ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స వల్ల రోగి కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
- ఐదు నుంచి ఆరు వారాల తర్వాత మాత్రమే వాకర్ సాయంతో నడవగలరు.
- మూడు నాలుగు వారాలపాటు దవాఖానలోనే ఉండాలి.
- నొప్పి ఎక్కువగా ఉంటుంది.
- మోకాలిని పూర్తిగా వంచడానికి నెల రోజుల సమయం పడుతుంది.

- రోబోటిక్ నీ-రీప్ల్లేస్మెంట్ సర్జరీ
- ఎముకల్ని కత్తిరిస్తున్నప్పుడు కచ్చితమైన కొలతలు ఉంటాయి కాబట్టి, సాధారణ శస్త్రచికిత్స కంటే ఎంతో సురక్షితమైంది.
- శస్త్రచికిత్స జరిగిన మరుసటి రోజే డిశ్చార్జ్ చేస్తారు.
- రోగి అతి త్వరగా కోలుకుంటాడు.
- సాధారణ శస్త్రచికిత్సతో పోల్చితే 60 శాతం మేర నొప్పి తక్కువగా ఉంటుంది.
- రెండుమూడు వారాల్లోనే వాకర్ సాయం లేకుండా నడవగలరు.
- మోకాలిని 2-3 వారాల్లోనే పూర్తిగా మడతపెడతారు.
- తనకు అమర్చే ఇంప్లాంట్ పరిమాణం గురించి శస్త్ర చికిత్సకు ముందే రోగి తెలుసుకోవచ్చు.
- రోబోటిక్లో సీటీ-స్కాన్ వల్ల సమస్య పట్ల పూర్తి అవగాహన వస్తుంది.
మొదటి దశ
తొలిదశలో కార్టిలేజ్ గరుకుగా మారడం మొదలవుతుంది. దీనివల్ల ఎక్కువ దూరం నడిచినా, తరచూ మెట్లెక్కినా మోకాళ్లలో నొప్పి వస్తుంది. ఈ దశలో రోగి తన సమస్యను గుర్తించే అవకాశాలు తక్కువ. ఈ ఇబ్బంది సాధారణంగా 50-60 ఏండ్లు పైబడిన వారిలో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నాలుగుపదుల వయసులోనూ ఎదురవుతున్నది.
రెండో దశ
రెండో దశలో కార్టిలేజ్ గరుకుదనం 50 శాతం మేర పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ సేపు నడిచినా, ఎక్కువ సమయం నిలబడినా నొప్పి వస్తుంది. ఈ దశలోనూ వ్యాధి లక్షణాలు అప్పుడప్పుడే కనిపించడం వల్ల రోగి పెద్దగా పట్టించుకోకపోవచ్చు.
మూడో దశ
ఈ దశలో కార్టిలేజ్ దాదాపుగా అరిగిపోతుంది. ఫలితంగా మోకాళ్లలోని ఎముకలు రాపిడికి గురవుతాయి. మోకాళ్లలో తరచూ నొప్పి వస్తుంది. ఎక్కువ దూరం నడవలేకపోతారు, కూర్చోలేకపోతారు. ఈ దశలో లక్షణాలు
స్పష్టంగా కనిపించడంతో రోగి తనకు మోకాళ్ల నొప్పులు వచ్చినట్లు గుర్తించగలుగుతాడు.
నాలుగో దశ
కార్టిలేజ్‌తో పాటు ఎముకలు అరిగిపోవడం వల్ల.. వాటి మధ్య దూరం తగ్గిపోతుంది. ఎముకల మధ్య రాపిడి జరగడంతో భరించలేనంత నొప్పి కలుగుతుంది. కాలు వంకరగా మారిపోతుంది. నాలుగు అడుగులు వేసినా నరకమే. కింద కూర్చోలేడు. కూర్చుంటే పైకి లేవలేడు. కనీసం మలవిసర్జనకు కూడా కూర్చోలేని పరిస్థితి.
-డాక్టర్ కుశల్ హిప్పల్గౌంకర్
ఆర్థోపెడిక్ సర్జన్
జాయింట్ రీప్లేస్మెంట్, రోబోటిక్స్ & ఆర్థ్రోస్కోపీ
సన్‌షైన్ హాస్పిటల్, హైదరాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

