చలికాలం వణికిస్తుంది. భయపెడుతుంది. పిల్లల విషయానికి వచ్చేసరికి కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ మారుతుంది. న్యుమోనియాకు దారితీస్తుంది. అలా నేరుగా శ్వాసకోశ వ్యవస్థ పై దాడికి తెగబడుతుంది. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి ఒకటే మార్గం.. ముందు జాగ్రత్త, తగినంత అప్రమత్తత! చలిగాలుల పులికోరల నుంచి బిడ్డలను రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే.
చలికాలంలో సీజనల్ వ్యాధులు సర్వసాధారణం. జలుబుతోపాటు ఊపిరితిత్తుల రుగ్మతలూ బాల్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందులో అత్యంత ప్రమాదకరమైంది.. న్యుమోనియా. ఐదేండ్ల లోపు పిల్లల మరణాల విషయంలో న్యుమోనియా తొలి ముద్దాయిగా నిలుస్తుంది. ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండున్నర లక్షలమంది మృత్యువాత పడుతున్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే 20 నుంచి 28 శాతం మంది పసిబిడ్డలు న్యుమోనియాతో బాధపడుతున్నట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ వర్గాల అంచనా. నిలోఫర్ దవాఖానలో ఓపీ కోసం తల్లిదండ్రులు రోజూ సుమారు 500 మంది పిల్లల్ని తీసుకొస్తే.. అందులో 50 నుంచి 80 వరకూ న్యుమోనియా కేసులే. పిల్లల్లో ఈ రుగ్మతను సకాలంలో గుర్తించకపోతే వ్యాధి తీవ్రత పెరిగిపోయి.. ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. చలికాలంలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉంటుంది. దీంతో కాలుష్య కారకాలు, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు కలిగించే వైరస్.. వాతావరణంలో మరీ పైకి వెళ్లలేవు. భూమికి ఐదు అడుగుల ఎత్తులోనే ఉంటాయి. దీంతో పిల్లలు శ్వాస పీల్చినప్పుడు అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి న్యుమోనియాకు దారితీస్తాయి.
న్యుమోనియా అంటే..
ఊపిరితిత్తుల్లో ఒక వైపున కానీ, రెండు వైపులా కానీ వచ్చే ఇన్ఫెక్షన్.. న్యుమోనియా లేదా నెమ్ము వ్యాధి. వాతావరణంలో అధిక చల్లదనం కారణంగా ఊపిరి
తిత్తులు ఇన్ఫెక్షన్ బారినపడతాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉబ్బసం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జలుబు తీవ్రత పెరిగిపోయి ఛాతీలో శబ్దం వస్తుంది. శ్వాసకోశాల్లో తెమడ పేరుకుపోవడంతో ఉఛ్వాసనిశ్వాసల్లో తీవ్ర అవరోధం ఏర్పడుతుంది. వ్యాధి ముదిరేకొద్దీ శ్వాస కష్టతరం అవుతుంది. రోగి పరిస్థితి విషమిస్తుంది.
ఎలా సోకుతుంది?
బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌తో పాటు ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్‌సీవీ) వల్ల కూడా న్యుమోనియా సోకుతుంది. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియాతో సైతం ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇందులో రెండు రకాల జబ్బులు.. ఒకటి బ్యాక్టీరియాతో వచ్చేది, మరొకటి వైరల్ ఇన్ఫెక్షన్స్తో కలిగేది. మొత్తంగా సమాజంలో కలిగే మార్పుల వల్ల వచ్చే న్యుమోనియాను
‘కమ్యూనిటీ అక్వయిర్డ్ న్యుమోనియా’ అంటారు. వాతావరణ మార్పులు, పరిసరాల ఇన్ఫెక్షన్లు దీనికి కారణం. ఇక వైద్యశాలల్లోని ఇన్ఫెక్షన్ల దుష్ప్రభావంతో వచ్చేదాన్ని ‘హెల్త్‌కేర్ అసోసియేటెడ్ న్యుమోనియా’ అంటారు. ఏదైనా అనారోగ్యంతో దవాఖానలో చేరినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్లు లేదా ఇన్‌ఫ్లుయెంజాతో బాధపడే వారినుంచి వెంటనే సోకిపోతుంది. ఐదు సంవత్సరాల లోపువారికి, హెచ్ఐవీ చిన్నారులకు ఈ వ్యాధి సోకే అవకాశాలు మరీ అధికం.
లక్షణాలు
ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది.
పక్కలు ఎగేయడం.
నాలుగు అడుగులు వేసినా ఆయాసం.
నిమిషానికి 30 సార్లకు మించి శ్వాస తీసుకోవడం.
తీవ్రమైన జ్వరం.
పొత్తికడుపు, ఛాతీలో నొప్పి.
తీవ్రమైన దగ్గు.
నోటి చుట్టూ చర్మం నీలిరంగుకు మారిపోవడం.
ముఖ్య టీకాలు
బీసీజీ
పెంటావ్యాక్
హిబ్
న్యుమోకోకల్
మీజిల్స్
ఫ్లూ షాట్ పరిశుభ్రతా ముఖ్యమే
శుచి, శుభ్రత ద్వారా కూడా న్యుమోనియాను కొంతమేర దూరంపెట్టవచ్చు. సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవడం, తరచూ ముక్కు, నోరు, కళ్లను తాకకుండా ఉండటం, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు నోటికి దస్తీ అడ్డుపెట్టుకోవడం, మరీ ఎక్కువమంది వాడే భోజనపాత్రలను ఉపయోగించకపోవడం, సామాజిక దూరం.. ఈ ఆరోగ్య సూత్రాలను పెద్దలు పాటించడమే కాదు, పిల్లలు సైతం అనుసరించేలా చూడాలి.
తల్లిపాలను మించిన ఔషధం లేదు
తల్లిపాలతో బిడ్డలో సహజంగానే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. న్యుమోనియా విషయానికొస్తే.. తల్లిపాలు తాగే పిల్లల్లో న్యుమోనియాను అడ్డుకునే శక్తి ఆరు రెట్లు అధికంగా ఉంటుంది. ఒక్క న్యుమోనియా అనే కాదు.. తల్లిపాలు సర్వరోగ నివారిణి. 90 శాతం వ్యాధులను తల్లిపాలు సమర్థంగా నిలువరిస్తాయి. తల్లులు తమ శిశువులకు చనుబాలతోనే సంరక్షించు
కోవచ్చు. ఇక రెండోది.. వ్యాక్సినేషన్. ప్రధాన టీకాలను ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందిస్తున్నది. సకాలంలో వేయించాల్సిన బాధ్యత కన్నవారిదే. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలతో పసిబిడ్డలకు టీకాలు వేయించడం లేదు. దాదాపు 60 నుంచి 70 శాతం మంది శిశువులకు మాత్రమే వ్యాక్సిన్లు చేరుతున్నాయి. వ్యాక్సినేషన్ 80 శాతం దాటితే కనుక, న్యుమోనియా తదితర వ్యాధుల బారినుంచి పిల్లలను కాపాడుకోవచ్చు. చల్లగాలి, పొగ, పెద్దలలో ఉన్న ఇన్ఫెక్షన్స్ వల్ల పిల్లలకు న్యుమోనియా సోకుతుంది. తెలంగాణ విషయానికి వస్తే.. శ్వాసకోశ వ్యాధులను అడ్డుకోవడానికి నిలోఫర్ హాస్పిటల్లో ప్రత్యేకించి ఒక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశాం. కరోనా తర్వాత ఆ వార్డును ‘సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్’ వార్డుగా పిలుస్తున్నాం. పిల్లల్లో న్యుమోనియా లక్షణాలు ఉంటే.. ఆలస్యం చేయకుండా హాస్పిటల్‌కు తీసుకువెళ్లడం మంచిది. ఆరంభ దశలో వ్యాధిని 99శాతం దాకా నివారించవచ్చు.
డాక్టర్ ఉషారాణి
ప్రొఫెసర్ ఆఫ్ పిడియాట్రిక్స్
నిలోఫర్ హాస్పిటల్
-మహేశ్వర్‌రావు బండారి