ప్రీ డయాబెటిస్.. మేల్కొలిపే అలారం!
డయాబెటిస్ రాత్రికి రాత్రి శరీరంలోకి ప్రవేశించదు. దాని వెనుక ఏండ్ల తరబడి ప్రయాణం ఉంటుంది. అది బయటపడే ముందు శరీరం ఒక హెచ్చరికను ఇస్తుంది. అదే ప్రీ డయాబెటిస్! ఇది డయాబెటిస్ కాదు కదా అని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అలాగని భయపడిపోవాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఈ దశలో జీవనశైలిని మార్చుకోవడం ద్వారా టైప్-2 డయాబెటిస్ ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చు.
ఒకప్పుడు యాభై అరవై ఏండ్లు దాటాక వచ్చే డయాబెటిస్… ఇప్పుడు నడి వయసులోనే పలకరిస్తున్నది. మారిపోయిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చునే పనిచేయడం, నిద్రలేమి, ఒత్తిడి.. లాంటి సవాలక్ష కారణాలతో రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతున్నది. ఈ డయాబెటిస్ రాత్రికి రాత్రే శరీరంలోకి ప్రవేశించదు. దాని వెనుక ఏండ్ల తరబడి ప్రయాణం ఉంటుంది. అది బయటపడే ముందు శరీరం ఒక హెచ్చరికలను జారీ చేస్తుంది. అదే ప్రీ డయాబెటిస్! ఇది డయాబెటిస్ కాదు కదా అని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అలాగని ప్రీ డయాబెటిస్ వచ్చిందంటే ఇక జీవితాంతం మధుమేహంతో బాధపడాల్సిందేనని భయపడిపోవాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఈ దశలో జీవనశైలిని మార్చుకోవడం ద్వారా టైప్-2 డయాబెటిస్ ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో రక్తంలో చక్కెరను సాధారణ స్థాయికి కూడా తీసుకురావచ్చు. ఇంతకీ ఈ ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? ఇది ఉన్నప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వ్యాయామం ఎందుకని అవసరం? నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది?
మన శరీరానికి అవసరమైన శక్తిలో ఎక్కువ భాగం ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్ నుంచే లభిస్తుంది. మనం తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్లే గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి చేరతాయి. కణాలు ఈ గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించుకోవడానికి క్లోమగ్రంథి (పాంక్రియాస్) ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. కొన్నిసార్లు శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించవు. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీంతో రక్తంలోని గ్లూకోజ్‌ను కణాలు సమర్థంగా వినియోగించుకోలేవు. ఫలితం! రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి క్లోమగ్రంథి మరింత ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. కొంతకాలం ఇలా అదనంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ శరీరం పరిస్థితిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ క్రమంగా ఈ సామర్థ్యం తగ్గినప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు సాధారణం కంటే ఎక్కువగా మారతాయి. అయితే అవి డయాబెటిస్ అని నిర్ధారించే స్థాయికి చేరుకోక ముందు, దానిని ప్రీ డయాబెటిస్ అంటారు. అంటే శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని చెప్పే ముందస్తు హెచ్చరిక!
ఇలా గుర్తిస్తారు!
ప్రీ డయాబెటిస్‌ను గుర్తించడానికి మూడు రకాల రక్త పరీక్షలు ఉపయోగపడతాయి. ఫాస్టింగ్ అంటే ఖాళీ కడుపు మీద గ్లూకోజ్ స్థాయి 100-125 mg/dl, ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత 140-199 మధ్య mg/dl ఉంటే దాన్ని ప్రీ డయాబటిక్గా భావిస్తారు. అలాగే ఒంట్లో మూడు నెలల గ్లూకోజ్ సగటు (HbA1c) 5.7% నుంచి 6.4% ఉంటే ఓ వ్యక్తి ప్రీ డయాబెటిక్ అని నిర్ధారిస్తారు. అయితే ఇందుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. గర్భిణులు, రక్త సంబంధిత సమస్యలు ఉన్నవారు, పిల్లల విషయంలో ఈ పరీక్షల ఫలితాలను వైద్యులే విశ్లేషించాలి.
ఇవీ లక్షణాలు
ప్రీ డయాబెటిస్‌లో సమస్య ఏమిటంటే.. చాలామందిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలూ కనిపించవు. ఆరోగ్యంగా ఉన్నామనే భావనతో సాధారణ పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల చాలామందికి రక్తంలో చక్కెర పెరుగుతున్న విషయమే తెలియదు. కొన్నాళ్లకి పూర్తిస్థాయి డయాబెటిస్ వచ్చాకే విషయం బయటపడుతుంది. అయితే చాలామందిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో సంబంధం ఉన్న కొన్ని సూచనలు కనిపించవచ్చు.
– మెడ దగ్గర చర్మం నల్లగా, మందంగా కనిపించే పరిస్థితిని అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో సంబంధం కలిగి ఉండవచ్చు.
– పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ముప్పుతో సంబంధం కలిగి ఉంటుంది.
– శరీర కణాలు గ్లూకోజ్‌ను సమర్థంగా వినియోగించుకోలేకపోవడంతో అలసట అనిపించవచ్చు.
– కొందరిలో ఆకలి లేదా దాహం పెరగవచ్చు.
వీటితో పాటు తరచూ మూత్రవిసర్జన, అతిగా దాహం వేయడం, ఒక్కసారిగా బరువు తగ్గడం, చూపు మసకబారడం లాంటి లక్షణాలు కనిపిస్తే అవి రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్న సూచనలు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ డయాబెటిస్ అనుకుని సరిపెట్టుకోకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

Pancrias
కారణాలు స్పష్టం
ప్రీ డయాబెటిస్ రావడానికి ఒకే ఒక్క కారణం ఉండదు.
వంశపారంపర్యం: తల్లిదండ్రులు, తోబుట్టువుల్లో టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ప్రీ డయాబెటిస్ వచ్చే ముప్పు ఎక్కువ.
శారీరక శ్రమ లేని జీవితం: రోజులో ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం (సెడెంటరీ), నడక, ఆటలు, వ్యాయామం వంటి కార్యకలాపాలు తగ్గిపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది.
ఆహారపు అలవాట్లు: చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, స్వీట్లు, బేకరీ పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తరచుగా తీసుకోవడం రిస్క్ పెంచుతుంది.
నిద్రలేమి: తగినంత నిద్ర లేకపోవడం, రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం, నిద్రకు సంబంధించిన సమస్యలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దోహదపడవచ్చు.
వీటితో పాటు… అధిక రక్తపోటు, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), గతంలో గర్భధారణ సమయంలో మధుమేహం రావడం వంటివి కూడా ముప్పును పెంచవచ్చు.
ప్రీ డయాబెటిస్.. డయాబెటిస్‌గా మారొద్దంటే!
ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి ఒక అవకాశం ఉంది. ఈ దశలో తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్ ముప్పు తగ్గించగలవు. అందుకు మందులకంటే ముందు జీవనశైలిలో మార్పులు తీసుకురావడం అవసరం. మరీ ముఖ్యంగా ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణ విషయంలో క్రమశిక్షణ తప్పనిసరి.
ఆకలిని చంపుకోవడం కాదు…
ప్రీ డయాబెటిస్ ఉందని అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అలాగే కార్బోహైడ్రేట్లు ఉన్న అన్ని పదార్థాలనూ దూరం పెట్టాల్సిన పనిలేదు. మనం తీసుకునే ఆహారంలో నాణ్యత, పరిమాణం, సమతుల్యత ముఖ్యం. దాని కోసం ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి…
తృణధాన్యాలకు ప్రాధాన్యం: పాలిష్ చేసిన తెల్ల బియ్యాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా, పరిమాణాన్ని తగ్గిస్తూ, ఇతర ధాన్యాలనూ ఆహారంలో చేర్చుకోవాలి. జొన్నలు, సజ్జలు, రాగులు, ఓట్స్, గోధుమలు, బ్రౌన్ రైస్ లాంటివి ఇందుకు మంచి ప్రత్యామ్నాయాలు. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను నెమ్మదింపజేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఒకేసారి వేగంగా పెరగకుండా సాయపడుతుంది.
మరిన్ని కూరగాయలు: ఆకుకూరలు, చిక్కుళ్లు, క్యారెట్, బీరకాయ, సొరకాయ, బెండకాయ, క్యాబేజీ లాంటి కూరలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రొటీన్లు మర్చిపోవద్దు: శనగలు, పెసర్లు, కందులు, రాజ్మా, సోయా, పాలు, పెరుగు, గుడ్లు లాంటి ప్రొటీన్ పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కండరాల ఆరోగ్యానికి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి తోడ్పడతాయి.
జ్యూస్ వద్దు: పండ్లలో సహజ చక్కెరతోపాటు పీచు పదార్థాలు కూడా ఉంటాయి. అందుకే జామ, యాపిల్, బొప్పాయి, నారింజ వంటి పండ్లను తగిన పరిమాణంలో తినాలి. వాటిని జ్యూస్‌గా మార్చినప్పుడు పీచు పదార్థం పోతుంది. పైగా పండ్ల రసాలను ఎక్కువగా తాగడం వల్ల చక్కెర త్వరగా శరీరంలోకి చేరుతుంది.
చక్కెర పానీయాలకు దూరం: కూల్‌డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్, అధిక చక్కెర కలిపిన టీ, కాఫీలు తగ్గించాలి. దాహం వేసినప్పుడు నీటికే ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితో పాటు బాదం, వాల్నట్స్, వేరుశనగలు, అవిసె గింజలు వంటి పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవచ్చు. వంటల్లో నూనె పరిమాణాన్ని నియంత్రించాలి. పదే పదే వేడి చేసిన నూనెలు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న బేకరీ, డీప్ ఫ్రైడ్ పదార్థాలను తగ్గించాలి.
భోజనాన్ని ఇలా విభజించండి!
మనం తినే భోజనంలో ఏది ఎంత ఉండాలనే విషయంలో అయోమయం ఉంటే ప్లేట్ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది.
– ప్లేట్లో సగభాగం కూరలు, ఆకుకూరలకు కేటాయించాలి.
– నాలుగో వంతు భాగంలో అన్నం, రొట్టె, ఇతర ధాన్యపు పదార్థాలు ఉండాలి.
– మిగిలిన నాలుగో వంతులో పప్పులు, శనగలు, గుడ్డు లేదా ఇతర ప్రొటీన్ పదార్థాలు ఉండాలి.
– పెరుగు, మజ్జిగ వంటి వాటిని తగిన మోతాదులో తీసుకోవచ్చు.
కొన్ని సందర్భాల్లో ఓ వ్యక్తి వయసు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈ ఆహార పరిమాణాలు మారవచ్చు.
రోజూ కొంత వ్యాయామం
ప్రీ డయాబెటిస్‌ను నియంత్రించడంలో శారీరక శ్రమకు చాలా ప్రాధాన్యం ఉంది. వ్యాయామం చేసినప్పుడు కండరాలు రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించుకుంటాయి. అంతేకాకుండా ఇన్సులిన్‌కు శరీరం మెరుగ్గా స్పందించేలా చేస్తుంది. అందుకోసం ఈ వ్యాయామాలు కీలకం…
నడక: వేగంగా నడవడం అత్యంత సులభమైన వ్యాయామం. రోజుకు 30 నిమిషాల చొప్పున వారానికి ఐదు రోజులు నడవడం మంచి అలవాటు.
సైక్లింగ్: సైకిల్ తొక్కడం ద్వారా కాళ్ల కండరాలకు వ్యాయామం లభిస్తుంది. శారీరక సామర్థ్యానికి అనుగుణంగా చేయవచ్చు.
ఈత: ఈత కూడా శరీరంలోని అనేక కండరాలకు వ్యాయామం అందిస్తుంది.
స్ట్రెంత్ ట్రైనింగ్: వైద్యులు లేదా శిక్షకుల సలహాతో శరీర సత్తువను పెంచే వ్యాయామాలు చేయడం వల్ల కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
యోగ, ప్రాణాయామం: శరీరానికి చురుకుదనం ఇవ్వడంతోపాటు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి.
రోజంతా వ్యాయామం చేయకపోయినా, గంటల తరబడి కుర్చీలో కూర్చోవడం మంచిది కాదు. ప్రతి 3060 నిమిషాలకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవాలి. ఫోన్లో మాట్లాడేటప్పుడు నడవడం, దగ్గర దూరాలకు బండి తీయకుండా నడవడం వంటి చిన్న మార్పులు కూడా ఉపయోగపడతాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సాధారణ పెద్దలకు వారానికి కనీసం 150 నిమిషాల మితమైన శారీరక శ్రమను సిఫార్సు చేస్తోంది. పిల్లలు, టీనేజర్లకు రోజుకు సగటున 60 నిమిషాల శారీరక కార్యకలాపాలు అవసరం.

Pre Diabetic India
నిద్రకు ప్రాధాన్యం
నిద్ర విశ్రాంతి మాత్రమే కాదు.. హార్మోన్ల సమతుల్యతకు కూడా ఎంతో అవసరం. తగినంత నిద్ర లేకపోతే ఆకలిని నియంత్రించే హార్మోన్ల పనితీరు దెబ్బతినవచ్చు. ఒత్తిడి హార్మోన్ల స్థాయి పెరగవచ్చు. ఇవన్నీ ఇన్సులిన్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రకు ముందు మొబైల్ వినియోగాన్ని తగ్గించడం, తగినంత నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పెద్దలకు సాధారణంగా 79 గంటలు, టీనేజర్లకు 810 గంటల నిద్ర అవసరం.
ఒత్తిడిని తగ్గించుకోండి
నిరంతర ఒత్తిడి వల్ల కార్టిసాల్ వంటి హార్మోన్ల ప్రభావంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగే అవకాశం ఉంది. అందుకే పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆందోళనలు, నిద్రలేమి వంటి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ధ్యానం, యోగా, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడతాయి.
దురలవాట్లకు దూరం
పొగతాగడం, పొగాకు వినియోగం ఇన్సులిన్ రెసిస్టెన్స్, గుండె సంబంధ సమస్యల ముప్పు పెంచుతాయి. ఆల్కహాల్ కూడా శరీర జీవక్రియల మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చు. వీటికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి అవసరం.
అశ్రద్ధ చేస్తే..
ప్రీ డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికీ కచ్చితంగా డయాబెటిస్ వస్తుందని చెప్పలేం. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోకుండా, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించకుండా ఉంటే టైప్-2 డయాబెటిస్‌గా మారే ప్రమాదం కచ్చితంగా పెరుగుతుంది. అంతేకాదు, డయాబెటిస్ నిర్ధారణ కాకముందే కొన్ని ఇతర ఆరోగ్య సమస్యల ముప్పు కూడా పెరగవచ్చు.
గుండె వ్యాధులు: ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో అధిక రక్తపోటు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరగడం వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇవి గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
మూత్రపిండాలపై ప్రభావం: రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఎక్కువగా ఉండటం, అధిక రక్తపోటు వంటి సమస్యలు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేయవచ్చు. ప్రీ డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికీ కిడ్నీ సమస్యలు వస్తాయని కాదు. అయితే జీవక్రియ సంబంధిత ప్రమాద కారకాలను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం.
కంటి సమస్యలు: రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల కంటి రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పూర్తిస్థాయి డయాబెటిస్ వచ్చిన తర్వాత ఈ ముప్పు మరింత పెరుగుతుంది.
నరాల సమస్యలు: దీర్ఘకాలం రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అధికంగా ఉండటం వల్ల నరాల పనితీరు దెబ్బతినవచ్చు. కొందరిలో ప్రీ డయాబెటిస్ దశలోనే నరాలకు సంబంధించిన కొన్ని సమస్యలు కనిపించవచ్చు.
వీటితో పాటు… ఫ్యాటీ లివర్, రక్తపోటు, అధిక కొవ్వు వంటి సమస్యలు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో సంబంధం కలిగి ఉంటాయి. అందుకే ప్రీ డయాబెటిస్‌ను కేవలం భవిష్యత్తులో వచ్చే షుగర్ వ్యాధికి ముందస్తు దశగా మాత్రమే చూడకూడదు. గుండె, కాలేయం, మూత్రపిండాలు సహా మొత్తం శరీర జీవక్రియ ఆరోగ్యం మొత్తాన్నీ బేరీజు వేసుకోవాల్సిన హెచ్చరికగా భావించాలి.
జీవితకాలం వేదనేనా?!
ప్రీ డయాబెటిస్ అంటే జీవితాంతం డయాబెటిస్ ఉన్నట్లేనా? అనంటే కచ్చితంగా కాదు అనే చెప్పాలి. ఇదే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం! ప్రీ డయాబెటిస్ అనేది ఒక హెచ్చరిక మాత్రమే. దాన్ని సరైన సమయంలో గుర్తించి జీవనశైలిని మార్చుకుంటే టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు.
అమెరికాలో నిర్వహించిన డయాబెటిస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అధ్యయనం ప్రకారం… జీవనశైలిలో మార్పులు చేసుకున్నవారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం సుమారు 58 శాతం తగ్గింది. ఆహార మార్పులు, శారీరక శ్రమ పెంచడం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఈ ఫలితం వచ్చింది. ప్రీ డయాబెటిస్‌ను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే స్పందిస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో ఈ పరిశోధన నిరూపిస్తున్నది.
ప్రీ డయాబెటిస్ ఒక శాపం కాదు. మన ఆరోగ్యాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవడానికి ప్రకృతి ఇచ్చే ముందస్తు హెచ్చరిక. ఆకలికి తగినంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజూ కొంత సమయం నడవడం, వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని నియంత్రించుకోవడం వంటి చిన్న చిన్న మార్పులతో భవిష్యత్తులో డయాబెటిస్ తో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలను నివారించగలం.
భారత్‌లో ప్రీ డయాబెటిస్ ముప్పు
అసలే దక్షిణాసియా వాసుల జన్యువులు డయాబెటిస్‌కు అనుకూలం అని తేలింది. దానికితోడు భారతీయుల ఇప్పటి ఆహార విధానం, దాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నదని హెచ్చరిక. ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మన దేశంలో సుమారు 15.3 శాతం మంది ప్రీ డయాబెటిస్తో ఉన్నట్లు అంచనా. దేశవ్యాప్తంగా 1,13,043 మందిని పరిశీలించిన ఈ అధ్యయనం 2008 నుంచి 2020 మధ్య సేకరించిన సమాచారం ఆధారంగా ఈ లెక్క తేల్చింది.

Medicine
మందులు అవసరమా?
ప్రీ డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికీ మందులు అవసరం ఉండవు. చాలామందికి ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం, తగిన నిద్ర వంటి జీవనశైలి మార్పులే ప్రధాన చికిత్సగా ఉపయోగపడతాయి. అయితే కొంతమందికి వారి కుటుంబ చరిత్ర, ఇతర ఆరోగ్య సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయులు లాంటి అంశాలు పరిశీలించాక వైద్యులు మందులను సూచించవచ్చు. సొంతంగా మందులు వాడటం, లేదా ప్రత్యామ్నాయ చికిత్సల పేరుతో వైద్య సలహా లేకుండా ఉత్పత్తులు తీసుకోవడం సరికాదు. పైగా ఇతర సమస్యలు రావచ్చు. అలాగే ప్రీ డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యాక క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించుకోవాలి. సాధారణంగా కనీసం ఏడాదికోసారి పరీక్షలు చేయించుకోవడం ఉపయోగకరం. వ్యక్తిగత పరిస్థితిని బట్టి వైద్యులు మరింత తరచుగా పరీక్షలు సూచించవచ్చు.
వీరికి పరీక్షలు తప్పనిసరి
1) కుటుంబంలో తల్లిదండ్రులు లేదా తోబుట్టువులకు టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు.
2) శారీరక శ్రమ తక్కువగా ఉండే జీవనశైలి, ఉద్యోగాలలో ఉండేవారు.
3) అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు.
4) PCOS ఉన్న మహిళలు.
5) పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోయిన వారు.
6) గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చిన మహిళలు.
7) అప్పటికే ప్రీ డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినవారు.
8) పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి, ఎంత తరచుగా చేయించుకోవాలి అనే విషయాలను వయసు, కుటుంబ చరిత్ర, ఇతర ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా వైద్యులు నిర్ణయిస్తారు.
– ఎన్. శిరీష

Testings
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

