Plastic Surgery | ప్లాస్టిక్ సర్జరీ… ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పదం.ఈ విజ్ఞానాన్ని గతంలో తక్కువగా వినియోగించేవారు. మారుతున్న పరిస్థితులు, వైద్యరంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా ఇప్పుడిదో అత్యవసర చికిత్సగా మారింది. రోగికి కొత్త జీవితాన్ని, పాత ఆకృతిని ప్రసాదించడంలో కీలకపాత్ర పోషిస్తున్నది.
కూలిన ఇంటిని తిరిగి కట్టుకున్నట్టు, మానవ శరీరాన్ని పునర్ నిర్మించేందుకు ప్లాస్టిక్ సర్జరీని ఉపయోగిస్తున్నారు. శరీర భాగాలకు సరికొత్త రూపాన్ని ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా దెబ్బతిన్న కాళ్లు, చేతులు తదితర అవయవాలకు పూర్వరూపం ఇవ్వడానికి కూడా ప్లాస్టిక్ సర్జరీనే మార్గం. నోటి క్యాన్సర్ బారిన పడిన రోగి ముఖభాగంలోని దవడ, చెంపలు తదితర భాగాలను తొలగించినప్పుడు.. అక్కడ ఏర్పడిన ఖాళీని పూడ్చి, రోగి ముఖాకృతిని గతంలో ఉన్నట్టు తీర్చిదిద్దేందుకు ప్లాస్టిక్ సర్జరీయే దిక్కు. ప్లాస్టిక్ సర్జరీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. క్షతగాత్రుల గాయాలు మాన్పడానికి సాయపడిన ఈ శస్త్రచికిత్స నేడు అన్ని వైద్య విభాగాలకూ విస్తరించింది. రోడ్డు ప్రమాదాలు, విద్యుదాఘాతాలు సంభవించినప్పుడు చర్మం, కండరాలు, కణజాలం పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో స్కిన్ గ్రాఫ్టింగ్ లేదా స్కిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (చర్మాన్ని అతికించడం లేదా మార్చడం) చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ‘రీ కన్స్ట్రక్టివ్ ఫ్లాప్’ శస్త్రచికిత్స సైతం అవసరం పడుతుంది. ప్లాస్టిక్ సర్జరీలో నాలుగు ప్రధాన భాగాలు ఉన్నాయి.
1. ఎక్యూట్ బర్న్ కేర్
అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పుడు ‘ఎక్యూట్ బర్న్ కేర్’ అందిస్తారు. చర్మం కాలిపోవడం లేదా తీవ్రంగా దెబ్బతినడం వల్ల శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్స్ తదితర ఫ్లూయిడ్స్ బయటికి వచ్చేస్తాయి. 15 శాతానికి మించి ఫ్లూయిడ్స్ బయటికి పోతే రోగి షాక్‌లోకి వెళ్లి మృతిచెందే ప్రమాదం ఉంటుంది. అందుకే, తీవ్ర గాయాలపాలైన వారికి అవసరాన్ని బట్టి స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్, రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది.
2. ఫేషియో మాక్సరీ ఇంజురీస్
రోడ్డు ప్రమాదాలప్పుడు ముఖంపై ఉండే ఎముకలు, మృదువైన కణజాలం (సాఫ్ట్ టిష్యూస్), దవడలు దెబ్బతింటాయి. ఇలాంటి గాయాలను ఫేషియో మాక్సరీ ఇంజురీస్ అంటారు. ముఖంలోని ఎముకలు, దవడలను ఈ పద్ధతిలో పునర్ నిర్మిస్తారు.
3. మైక్రో వాస్క్యులర్ సర్జరీస్
ప్రమాదవశాత్తు కాళ్లు, చేతులు, వేళ్లు తెగిపడినప్పుడు, వాటిని తిరిగి అతికించడం ఈ విధానంతో సాధ్యమవుతుంది. పుట్టుకతోనే కొందరికి చేతివేళ్లు ఉండవు. ఉన్నా ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి. ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘సిన్డక్టిలి’ అంటారు. కొంతమందిలో చెయ్యి వంకరగా ఉంటుంది. దీన్ని ‘రేడియల్ క్లబ్ హ్యాండ్’ అంటారు. కొంతమందికైతే పుట్టుకతోనే బొటనవేలు ఉండదు. ఈ సమస్యను ‘థంబ్ ఎప్లాసియా’ అంటారు. ఈ సమస్య పరిష్కారంలో భాగంగా చూపుడు వేలినే బొటనవేలుగా మారుస్తారు. ఈ సమస్యలన్నిటికీ హ్యాండ్ అండ్ మైక్రో వాస్క్యులర్ పద్ధతిలో సర్జరీ చేసి, లోపాన్ని సరిచేస్తారు. ఇన్ఫెక్షన్స్కు, గాయాలకు చికిత్స అందించడంతోపాటు కణుతులను తొలగించడం, కణజాలాన్ని ఒక భాగం నుంచి తీసి, గాయాలపాలైన మరోచోట అమర్చడం మైక్రో వాస్క్యులర్ సర్జరీ ప్రత్యేకత. అవసరమైతే, శరీరంలోని ఒక భాగం నుంచి రక్తనాళాలతో సహా ఎముక, చర్మం, కండను తీసి.. దెబ్బతిన్న అవయవాన్ని మళ్లీ నిర్మించడం ఈ విధానం ప్రత్యేకత.
4. ఈస్తటిక్ సర్జరీ
దీన్నే కాస్మొటిక్ సర్జరీ అని కూడా అంటారు. ఈ చికిత్స పద్ధతిలో రొమ్ములు, ముక్కు, చెవులు మొదలైన భాగాలకు తీరైన ఆకారం ఇస్తారు. ముక్కు, చెవుల లోపాలు సరిచేయడం, బుగ్గల మీద సొట్టలు పడేలా చేయడం, పొట్టలోని కొవ్వును తగ్గించడం ఇందులో భాగమే. జారినట్టు ఉన్న పొట్టను, ఛాతీని సరైన ఆకృతికి తీసుకొస్తారు. ‘బ్రెస్ట్ ఆగ్మంటేషన్’ ద్వారా రొమ్ములు లేనివారికి, క్యాన్సర్ కారణంగానో, ప్రమాదంలోనో వాటిని కోల్పోయినవారికి కృత్రిమంగా జోడిస్తారు. బ్రెస్ట్ రిడక్షన్‌తో రొమ్ము పరిమాణాన్ని తగ్గిస్తారు. బ్రెస్ట్ లిఫ్టింగ్ ద్వారా సాగిన రొమ్ములను సరిచేస్తారు. గైనికోమ్యాకియా.. అంటే పురుషుల్లో అసహజంగా పెరిగిన రొమ్ములనూ సరిచేస్తారు.
రీకన్స్ట్రక్టివ్ ఫ్లాప్ సర్జరీ
యాసిడ్ దాడులు, విద్యుదాఘాతాలు, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రగాయాల పాలైన రోగుల కండరాలు, నరాలు, రక్తనాళాలు దెబ్బతింటాయి. ఎముకలు బయటికి తేలడంతో సహజ ఆకృతి చెదిరిపోతుంది. ఫ్లాప్ సర్జరీ ద్వారా ఆయా భాగాలను పునర్ నిర్మించి కొత్త రూపాన్ని ఇస్తారు. తెగిపోయిన నరాలు, రక్తనాళాలను అనుసంధానం చేసి చేతులు, కాళ్లకు పూర్వ రూపం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ముక్కు, చెవి, పెదాలు, నాలుక, కనురెప్పలకు సైతం పూర్వరూపం ఇస్తారు.
ఉన్న రూపాన్ని సరిచేయడం
కొంతమంది ఆడ శిశువులు పొలాండ్ సిండ్రోమ్ (ఒకే వైపు రొమ్ముతో), వ్జైనల్ ఎజెనసిస్ (యోని లేకుండా)తో జన్మిస్తారు. ఇలాంటి లోపాలు ఉన్నవారికి యుక్త వయసు వచ్చిన తరువాత శస్త్రచికిత్సలు జరిపి, వివాహానికి అర్హులుగా మారుస్తారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా బట్టతలనూ నివారిస్తున్నారు.
నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్
ఇందులో ప్రధానంగా మూడు రకాల చికిత్స అందిస్తారు.
బొటాక్స్
నుదుటిపైన, ముక్కుపైన, కళ్ల చుట్టూ, ముఖంపై ఏర్పడిన ముడతలను తొలగిస్తారు.
ఫిల్లర్స్
గాయాలు, క్యాన్సర్ వంటి సర్జరీల వల్ల శరీరంపై ఏర్పడిన ఎగుడు దిగుళ్లను సవరిస్తారు.
లేజర్స్
ముఖం, ఇతర భాగాలపై అవాంఛిత రోమాలను, పచ్చబొట్లను, మచ్చలను లేజర్ చికిత్స ద్వారా తొలగిస్తారు.
హైఫు అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్
ఈ పద్ధతిలో స్కిన్ టైట్నింగ్, కొవ్వు తగ్గించడం వంటివి చేస్తారు.
జనరల్ ప్లాస్టిక్ సర్జరీ
గ్రహణ మొర్రి ఉన్నవారిలో పెదాలను, బోద కాలు రోగుల్లో కాళ్లను సరిచేస్తారు. కాంప్లెక్స్ ఊండ్ మేనేజ్మెంట్లో భాగంగా.. ఏవైనా సర్జరీల తరువాత.. ఇన్ఫెక్షన్స్ వల్ల శస్త్రచికిత్స జరిగిన భాగంలో కుట్లు తెరుచుకు పోవడంతో ఏర్పడిన గాయాలను కూడా మూసి వేస్తారు. డయాబెటిక్ ఫుట్ వల్ల ఉత్పన్నమయ్యే గాయాలను సరిచేస్తారు. ఇయర్ రీకన్స్ట్రక్షన్ ద్వారా.. చెవులు లేకుండా జన్మించిన పిల్లలకు చెవులను జోడిస్తారు. ఒకటేమిటి అనేకానేక రుగ్మతలకు ప్లాస్టిక్ సర్జరీ ఓ వరంగా మారింది. రోగికి ఆత్మవిశ్వాసాన్ని, పాత జీవితాన్నీ ఇస్తున్నది.
…?మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ రాజేష్ వాసు ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు స్టార్ హాస్పిటల్ నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్