మా బాబు వయసు మూడు నెలలు. కాన్పు సజావుగానే జరిగింది. పుట్టగానే కామెర్లు వచ్చాయి. చికిత్సతో తగ్గిపోయాయి. అంతా బాగానే ఉంది కానీ, తను మా మాటలకు స్పందించడం లేదు. నవ్వడం లేదు. బాబు తర్వాత పుట్టిన మా చెల్లి పాప మాత్రం చాలా హుషారుగా ఉంటున్నది. కేకలేస్తుంది. నవ్వుతుంది. ఎందుకింత తేడా?
ఓ పాఠకురాలు
పాలు ఇస్తున్నప్పుడు, బట్టలు మారుస్తున్నప్పుడు, ఎత్తుకుని ముద్దాడుతున్నప్పుడు.. బిడ్డ స్పందన ఎలా ఉంటుందన్నది కన్నతల్లికే బాగా తెలుస్తుంది. పిల్లలు ఆ ప్రేమకు, శ్రద్ధకు స్పందిస్తారు. ఆస్వాదిస్తారు. చిరునవ్వులు చిందిస్తారు. దీన్నే సోషల్ స్మైల్ అంటారు. మూడు నెలలు నిండినా కూడా మీ బాబు స్పందించడం లేదంటే.. ఓ సారి వైద్యులను సంప్రదించండి. గదిలో లైటు వేయగానే.. మీ బిడ్డ కళ్లు ఎలా స్పందిస్తాయన్నదీ గమనించండి.
ఆ సమయంలో తలతిప్పి చూస్తాడా, లేదా? అనేది ఒకసారి పరిశీలించండి. కొన్నిసార్లు దృష్టిలోపం కారణంగా కూడా పిల్లలు స్పందించరు. కాబట్టి నేత్ర పరీక్షలు చేయించండి. వినికిడి లోపాలు ఉన్నా పిల్లలు స్పందించలేరు. కాబట్టి, చెవి పరీక్షలు కూడా చేయించండి. అవసరమైతే, బిడ్డ ఎదుగుదల క్రమాన్ని సాధికారికంగా విశ్లేషించగల డెవలప్మెంటల్ పీడియాట్రీషియన్ను కలిస్తే మరీ మంచిది.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్