Pranayama | జీవశక్తికి ప్రాణాయామం
ప్రాణవాయువు.. ప్రాణాలను నిలబెట్టే వాయువు. ఆంగ్లంలో ఆక్సిజన్ అంటాం. మనం శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. శ్వాస బయటికి వదిలినప్పుడు కార్బన్డయాక్సైడ్ విడుదల అవుతుంది. మనిషి బతకాలంటే నిరంతరం శ్వాస తీసుకోవాలి.
Pranayama | ప్రాణవాయువు.. ప్రాణాలను నిలబెట్టే వాయువు. ఆంగ్లంలో ఆక్సిజన్ అంటాం. మనం శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. శ్వాస బయటికి వదిలినప్పుడు కార్బన్డయాక్సైడ్ విడుదల అవుతుంది. మనిషి బతకాలంటే నిరంతరం శ్వాస తీసుకోవాలి. ఆ శ్వాసను క్రమపద్ధతిలో, అవసరమైనంత మేర తీసుకోవడమే ప్రాణాయామం. నిరంతర సాధన ద్వారా మనిషి ఊపిరితిత్తులు ఒకటిన్నర నుంచి రెండున్నర లీటర్ల గాలిని తీసుకోగలిగే సామర్థ్యానికి చేరుకుంటాయి. వ్యసనాలు, కాలుష్యం కారణంగా కోల్పోయిన సమర్థతను తిరిగి రాబట్టుకుంటాయి కూడా.
ప్రాణాయామం అంటే శ్వాసక్రియ రూపంలో ఆక్సిజన్‌ను శరీరంలోకి తీసుకోవడం. శ్వాసక్రియ ద్వారా మనం పీల్చే గాలి పరిమాణం పెరిగితే, జీవకణాలకు ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ అందుతుంది. ఫలితంగా అవి శక్తిమంతం అవుతాయి. జీవకణాలు శక్తిమంతమైతే.. మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లుతాడు. ప్రాణాయామంలో భాగంగా కండరాల్ని బిగబట్టడం, వదులు చేయడం వల్ల ఆయా భాగాలు చైతన్యమంతం అవుతాయి. వివిధ యోగాసన భంగిమల్లో పైకి, కిందికి, పక్కలకు కదలడం వల్ల శరీరం మొత్తం బలోపేతం అవుతుంది.
ప్రాథమిక ఆసనాలు
ప్రాణాయామ విధానాల సంఖ్యను కచ్చితంగా చెప్పలేం. చాలా రకాలు ఉన్నాయి. ప్రత్యేకించి అందులో ఓ ఐదు నిత్యజీవితంలో ఎంతో ఉపయోగపడతాయి…
సుఖ ప్రాణాయామం
శరీరానికి ఇబ్బంది లేకుండా.. సుఖవంతంగా చేసే ప్రాణాయామం ఇది. దీన్నే అనులోమ, విలోమ ప్రాణాయామం అంటారు. ఇందులో కుడి ముక్కును బొటనవేలితో మూసి ఎడమ ముక్కుతో గాలి పీల్చాలి. ఆ తరువాత ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు ద్వారా గాలి బయటికి వదలాలి. అదే తరహాలో ఎడమ ముక్కును మూసి.. కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి, ఎడమ నాసికా రంధ్రం ద్వారా బయటికి వదలాలి. ఈ ప్రాణాయామం వల్ల ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. గుండెకు కూడా మంచిదే. అందులోనూ, ఈ మధ్యకాలంలో చాలామంది 30-40 ఏండ్లలోపే గుండె సమస్యలకు గురవుతున్నారు. గుండెపోటుతో మృతి చెందుతున్నారు. వాటిని నియంత్రించే శక్తి ప్రాణాయామానికి ఉంది. ప్రాణశక్తి సాధన వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి గుండె లయ క్రమపద్ధతిలో సాగుతుంది. బ్లడ్ పంపింగ్ సైతం సక్రమంగా జరుగుతుంది.
నాడీశోధన ప్రాణాయామం
ఈ ప్రాణాయామాన్ని 1:2 నిష్పత్తిలో చేయాలని చెబుతారు. సుఖ ప్రాణాయామం మాదిరిగానే గాలిని ఒక నాసికా రంధ్రంతో పీల్చి, మరో రంధ్రంతో వదలాలి. కానీ, గాలి పీల్చే వ్యవధికి, వదిలే వ్యవధికి కొంచెం తేడా ఉంటుంది. 10 సెకన్ల పాటు పీల్చితే, 20 సెకన్ల పాటు వదలాల్సి ఉంటుంది. ఈ ప్రాణాయామం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బీపీ నియంత్రణలో ఉంటే సగం జబ్బులు దూరమైనట్టే.
సూర్య-చంద్రభేద ప్రాణాయామం
ఈ ప్రాణాయామంలో కుడి నాసికా రంధ్రం నుంచి గాలిని పీల్చి, అదే రంధ్రం నుంచి వదలాల్సి ఉంటుంది. తరువాత ఎడమ నాసికా రంధ్రం నుంచి గాలిని పీల్చి, తిరిగి అదే రంధ్రం నుంచి విడిచిపెట్టాలి. ఈ పద్ధతి వల్ల శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు తొలగిపోయి.. సమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం ఉష్ణతాపాన్ని అధిగమిస్తుంది. చల్లదనం ఆవరిస్తుంది.
శీతలి ప్రాణాయామం
వేసవి కాలంలో అత్యంత ఉపయుక్తమైన ప్రాణాయామం. దీనివల్ల వడదెబ్బ, అధిక రక్తపోటు, కళ్లమంట తగ్గుతాయి. ఈ ప్రక్రియలో నాలుకను బయటికి చాచి.. మడతపెట్టి, ‘సీ’ శబ్దంతో నోటిద్వారా గాలిని పీల్చాలి. అనంతరం నోటిని మూసేసి.. రెండు నాసికా రంధ్రాల ద్వారా గాలి బయటికి వదలాలి. దీనివల్ల ఉష్ణతాపాన్ని అధిగమిస్తాం.
శీత్కారి ప్రాణాయామం
కొంతమందికి నాలుక బయటికి చాచి, మడత పెట్టే వీలు ఉండదు. అలాంటి వారికోసమే శీత్కారి ప్రాణాయామం. ఇందులో నోరు తెరిచి, దంతాలు గట్టిగా బిగబట్టి దంతాల మధ్య నుంచి గాలిని ‘సీ’ శబ్దంతో పీల్చాలి. అనంతరం నోటిని మూసేసి.. రెండు నాసికా రంధ్రాల ద్వారా గాలి బయటికి వదలాలి. ఈ పద్ధతిలోనూ శీతలిలో కలిగే ప్రయోజనాలన్నీ లభిస్తాయి.
అనేక లాభాలు
చేయాల్సిన పద్ధతిలో ప్రాణాయామం చేస్తే.. పరిపూర్ణ ఆరోగ్యం సొంతం అవుతుందని యోగాచార్యులు చెబుతారు. ప్రాథమిక దశలో నిపుణుల పర్యవేక్షణ చాలా అవసరం. యూట్యూబ్ పాఠాలు, వాట్సాప్ బోధనలు హానికరం.
- మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుంది.
- రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
- చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.
- గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది.
- గుండె ద్వారా బ్లడ్ పంపింగ్ సక్రమంగా జరుగుతుంది. హృద్రోగాలు దరిచేరవు.
- ఆయుర్దాయం పెరుగుతుంది.
- శరీర ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయి. ఇది ఎక్కువగా వేసవిలో ఉపయోగపడుతుంది.
- మనసు మీద నియంత్రణ వస్తుంది. క్రమంగా వ్యసనాలను జయిస్తాం.
యోగాసనాల వల్ల..
ప్రాణాయామంతో పాటు యోగాసనాల ద్వారా కూడా చాలా జబ్బులను అదుపులో ఉంచుకోవచ్చు.
అసలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
అధిక రక్తపోటు : నాడీశుద్ధి ప్రాణాయామ, శవాసనం, పశ్చిమోత్తానాసనం, వజ్రాసనం, సుప్త వజ్రాసనం, శిథిలాసనం, శశాంకాసనం.
హృద్రోగ సమస్యలు : సుఖప్రాణాయామ, నాడీశుద్ధి ప్రాణాయామ, యోగనిద్ర, త్రికోణాసనం, గోముఖాసనం, ఉష్ర్టాసనం, భుజంగాసనం, శలభాసనం.
మధుమేహం : సూర్యనమస్కారాలు, పశ్చిమోత్తానాసనం, గోముఖాసనం.
నెలసరి సమస్యలు: యోగనిద్ర, గర్భాసనం, పశ్చి మోత్తానాసనం, భుజంగాసనం, నాడీశుద్ధి ప్రాణాయామం.
ఉబ్బసం: సూర్యనమస్కారం, గోముఖాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, సుప్తవజ్రాసనం, ఉష్ర్టాసనం, వివిధ ప్రాణాయామాలు.
ఆర్థరైటిస్ సమస్యలు: త్రికోణాసనం, తాడాసనం, అర్ధచంద్రాసనం, నావాసనం, సూర్యభేది ప్రాణాయామం, వివిధ ప్రాణాయామాలు.
నడుం నొప్పి: భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, కోణాసనం, చక్రాసనం, పలు ప్రాణాయామాలు.
అజీర్ణం, వాయు సమస్య: పశ్చిమోత్తానాసనం, వజ్రాసనం, మయూరాసనం, సర్వాంగాసనం, మత్స్యాసనం, ప్రాణాయామాలు.
ఊబకాయ సమస్య: ధనురాసనం, సూర్యనమస్కారం, కటిచక్రాసనం, పశ్చిమోత్తానాసనం, సర్పాసనం, ప్రాణాయామాలు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

