Health Tips | మా బాబు వయసు మూడేండ్లు. హుషారుగా ఉండేవాడు. బాగా ఆడుకునేవాడు. ఈ మధ్య నీరసంగా ఉంటున్నాడు. బాబు భోజనానికి మారాం చేస్తాడు కానీ, పాలు ఇష్టంగా తాగుతాడు. చూసినవాళ్లు తెల్లకామెర్లేమో అంటున్నారు. అసలు, తెల్లకామెర్లు అంటే ఏమిటి?
-ఓ పాఠకురాలు
మీరు చెబుతున్న వివరాలను బట్టి బాబులో ఎనీమియా లక్షణాలున్నాయి. రక్తహీనతతో బాధపడుతున్నట్టు అర్థం అవుతున్నది. సమతుల ఆహారం తీసుకోని పిల్లల్లో తగిన మోతాదులో రక్తం తయారు కాదు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. ఎక్కువ పాలు తాగడానికి ఇదో కారణం. ఈ సమయంలో ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారులైతే మటన్, కిడ్నీ, లివర్ లాంటివి పెట్టాలి. బెల్లంలోనూ ఐరన్ ఉంటుంది. ముందుగా మీరు చిన్నపిల్లల నిపుణుడిని సంప్రదించండి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్షలు చేయించి, తగిన మందులు వాడండి. రక్తహీనత వల్ల పిల్లలు తెల్లగా పాలిపోయినట్టు ఉంటారు కాబట్టి, జనం దీనికి తెల్లకామెర్లు అనే ముద్ర వేశారు. దయచేసి పసరుమందుల జోలికి వెళ్లకండి. సరైన చికిత్సతో, పోషకాహారంతో పూర్తిగా నయం చేయదగిన రుగ్మత ఇది. భయపడాల్సిన అవసరం లేదు.