Melatonin Supplements | ఆధునిక జీవనశైలి కారణంగా నిద్ర సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒత్తిడి, ఎక్కువసేపు మొబైల్, స్క్రీన్ల వినియోగం, రాత్రివేళల్లో కృత్రిమ వెలుతురు వంటి కారణాలతో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో త్వరగా నిద్ర పట్టేందుకు మెలటోనిన్ సప్లిమెంట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే వీటిని ఎక్కువకాలం వాడటం ఆరోగ్యానికి హానికరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెలటోనిన్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్. ఇది నిద్ర-మెలకువ చక్రాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెలటోనిన్ సప్లిమెంట్లు ఈ సహజ హార్మోన్లా పనిచేసి శరీరానికి విశ్రాంతి సమయం వచ్చిందని సంకేతం ఇస్తాయి. దీంతో త్వరగా నిద్ర పట్టేందుకు, నిద్ర నాణ్యత మెరుగుపడేందుకు సహాయపడతాయి.
అయితే నిద్ర సమస్యలు ఎక్కువ కావడంతో చాలామంది మెలటోనిన్ను అధికంగా లేదా నిరంతరం వినియోగించడం ప్రారంభిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా వాడితే శరీరంలోని సహజ నిద్ర చక్రం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మెలటోనిన్ను ఎక్కువకాలం వాడటం వల్ల పగటి సమయంలో మత్తుగా ఉండటం, తలనొప్పి, తల తిరగడం, మెదడు మందగించినట్టుగా అనిపించడం వంటి సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో అలసట, ఏకాగ్రత లోపం కూడా కనిపిస్తాయి. అధిక మోతాదులో లేదా దీర్ఘకాలంగా మెలటోనిన్ వాడితే శరీరంలో సహజంగా మెలటోనిన్ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా సప్లిమెంట్లు ఆపిన తరువాత సహజంగా నిద్రపోవడం మరింత కష్టమయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే నిద్ర సమయం పెరిగినా, నిద్ర నాణ్యత తగ్గిపోతుందని చెబుతున్నారు.
మెలటోనిన్ను తాత్కాలిక పరిష్కారంగా మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా 2 నుంచి 6 వారాల మధ్య మాత్రమే వాడటం మంచిదని పేర్కొంటున్నారు. నిద్ర సమస్యలు తగ్గిన తరువాత వీటిని ఆపేయాలని సూచిస్తున్నారు. మెలటోనిన్ తీసుకున్న తరువాత మత్తు ఎక్కువగా ఉండటం, అలసట, విచిత్రమైన కలలు రావడం లేదా ఎలాంటి ప్రయోజనం కనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వినియోగం నిలిపివేయాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమికి కారణమయ్యే ఒత్తిడి, ఆందోళన, చెడు నిద్ర అలవాట్లు వంటి మూల కారణాలను కూడా పరిష్కరించడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువకాలంగా మెలటోనిన్ వాడుతున్నవారు ఒక్కసారిగా ఆపకుండా మోతాదును క్రమంగా తగ్గించడం మంచిదని చెబుతున్నారు. మెలటోనిన్ను వాడేటప్పుడు తక్కువ మోతాదుతో ప్రారంభించి, నిద్రకు అరగంట నుంచి గంట ముందు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర సమస్యలు కొనసాగితే స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించడం అవసరమని హెచ్చరిస్తున్నారు.