Summer Drinks | దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ కొబ్బరి నీరు వేసవిలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయంగా మారింది. సహజ ఎలక్ట్రోలైట్స్, చల్లదన లక్షణాలు, శరీరానికి తక్షణ హైడ్రేషన్ అందించే గుణాలు ఉన్నందున ఫిట్నెస్ అభిరుచి ఉన్నవారి నుండి ఎండ తీవ్రతతో బాధపడేవారి వరకు చాలామంది దీనిని ఆశ్రయిస్తుంటారు. చక్కెర పానీయాలకు ప్రత్యామ్నాయంగా ఇది ఆరోగ్యకరమైన ఎంపికగా భావిస్తారు. అయితే నేచురల్ సూపర్డ్రింక్ గా ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధికంగా తీసుకోవడం వల్ల అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య మార్గదర్శకాలు ఇచ్చే వరల్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO), అమెరికన్ హార్ట్ అసోసియేషన్(AHA) వంటి సంస్థలు వేసవిలో సరైన హైడ్రేషన్ చాలా ముఖ్యమని చెబుతున్నాయి. అయితే సమతుల్యత కూడా అంతే అవసరం. శరీరానికి అవసరమైన పోషకాలను కూడా మోతాదుకు మించి తీసుకుంటే హానికరమవుతాయి. ముఖ్యంగా పొటాషియం అధికంగా ఉండే కొబ్బరి నీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.
కొబ్బరి నీరు సుమారు 95 శాతం నీటితో కూడి ఉండటంతోపాటు పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్‌ను కలిగి ఉంటుంది. చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడం, తేలికపాటి డీహైడ్రేషన్ ను తగ్గించడం, తక్కువ కాలరీలతో హైడ్రేషన్ ఇవ్వడం వంటి ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగిస్తారు. అయితే తీవ్రమైన డీహైడ్రేషన్ సందర్భాల్లో ఇది ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS)కి సరైన ప్రత్యామ్నాయం కాదని నిపుణులు చెబుతున్నారు. అధికంగా కొబ్బరి నీరు తాగడం వల్ల వచ్చే ప్రధాన సమస్య పొటాషియం అధికం కావడం. ఒక సర్వింగ్లోనే గణనీయమైన పొటాషియం ఉండటంతో ఎక్కువగా తీసుకుంటే రక్తంలో పొటాషియం స్థాయి పెరిగి Hyperkalemia అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల కండరాల బలహీనత, గుండె కొట్టుకోవడంలో అసమానత, తీవ్రమైన సందర్భాల్లో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని వైద్య నివేదికల్లో అధికంగా కొబ్బరి నీరు తాగడం వల్ల ప్రమాదకర స్థాయిలో పొటాషియం పెరిగిన కేసులు కూడా నమోదయ్యాయి. జీర్ణ సంబంధ సమస్యలు కూడా అధిక వినియోగంతో కనిపించవచ్చు. కొబ్బరి నీటిలో ఉండే ఫర్మెంటబుల్ కార్బోహైడ్రేట్లు (FODMAPs) ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు, గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది సహజ విసర్జన కారకంగా (లాక్సేటివ్) పనిచేసి సమస్యలను మరింత పెంచుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇక ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కూడా మరో సమస్య. పొటాషియం అధికంగా, సోడియం తక్కువగా ఉండటం వల్ల శరీరంలోని సహజ సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల తలనొప్పి, తల తిరగడం, తక్కువ రక్తపోటు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా రక్తపోటు మందులు వాడేవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందరికీ కొబ్బరి నీరు అనుకూలం కాదు. కిడ్నీ సమస్యలున్నవారు, డయాబెటిస్ ఉన్నవారు, గుండె వ్యాధిగ్రస్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు, కొన్ని మందులు వాడేవారు జాగ్రత్తగా తీసుకోవాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే అధిక పొటాషియాన్ని శరీరం బయటకు పంపలేకపోవడం వల్ల ప్రమాదం పెరుగుతుంది.
హైడ్రేషన్ కోసం కూడా కొబ్బరి నీటిపై పూర్తిగా ఆధారపడటం సరైంది కాదు. WHO ప్రకారం సాధారణంగా నీరు ప్రధాన హైడ్రేషన్ మూలం కావాలి. అవసరం లేకుండా ఎక్కువ ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవడం శరీరానికి ఉపయోగం కంటే నష్టమే కలిగిస్తుంది. తీవ్రమైన డీహైడ్రేషన్ పరిస్థితుల్లో ORS మరింత ప్రభావవంతంగా ఉంటుంది. సురక్షిత వినియోగం కోసం రోజుకు 1-2 గ్లాసుల ORS మాత్రమే తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువగా తాగకుండా జాగ్రత్త పడాలి. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి మోతాదును నియంత్రించాలి. కొబ్బరి నీటిని మితంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన వేసవి పానీయం. కానీ సహజం అన్న కారణంతో అధికంగా తీసుకుంటే ప్రమాదాలు కూడా ఉంటాయి. సరైన సమతుల్యత పాటిస్తూ, అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.